చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికించింది. ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది ఈ మహమ్మారి బారిన పడగా.. లక్షల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. కాగా.. ఇప్పుడిప్పుడే ఈ మహమ్మారి అంతానికి వ్యాకిన్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఇక మనదేశంలో కూడా కరోనా వ్యాక్సినేషన్ పంపిణీ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. యూఎస్ జౌషద దిగ్గజం మెర్క్ అండ్ కో సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్నో విజయవంతమైన వ్యాక్సిన్లు తయారు చేసి సరఫరా చేస్తున్న మెర్క్.. తాము రూపొందించిన రెండు పరిశోధనాత్మక కరోనా వ్యాక్సిన్ లను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ప్రాధమిక ట్రయల్స్ వెల్లడించిన గణాంకాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
మెర్క్ కూడా కరోనా మహమ్మారి అంతానికి వ్యాక్సిన్లను తయారు చేసే పనిలో నిమగ్నమైంది. అందులో భాగంగా 'వీ590' పేరిట ఓ వ్యాక్సిన్ ను 'వీ591' మరో వ్యాక్సిన్ నూ మెర్క్ అభివృద్ధి చేసింది. వీటిల్లో ఒకటి ఎబోలా వైరస్, మరోటి మీజిల్స్ వ్యాక్సిన్ ఆధారిత సాంకేతికతతో మెర్క్ అభివృద్ధి చేసింది. అయితే.. ఈ రెండు వ్యాక్సిన్ లూ శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచేలా యాంటీ బాడీలను ఉత్పత్తి చేయడంలో విఫలమైనట్టు ప్రాధమిక ట్రయల్స్ గణాంకాలు వెల్లడించాయి. ఇక మెర్క్‌కు ప్రధాన పోటీదారులు ఉన్న ఫైజర్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ లకు చెందిన కరోనా వ్యాక్సిన్లు ఇప్పటికే ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. కాగా.. మెర్క్ అభివృద్ది చేసిన టీకాలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉండడంతో.. తమ టీకాల ప్రయోగాలకు స్వస్తి చెప్పాలని మెర్క్ నిర్ణయించింది.
'ఈ ఫలితాలు మాకు కొంత ఆశ్చర్యాన్ని కలిగించాయి. వీటితో మేము నిరుత్సాహపడ్డాం. మేము వేయాలనుకున్న అడుగులు వేయలేకపోయాము. వ్యాక్సిన్ తయారీకి శ్రమించిన శాస్త్రవేత్తలకు, ఉద్యోగులకు కృతజ్ఞతలు అని మెర్క్ క్లినికల్ రీసెర్చ్ విభాగం ఉపాధ్యక్షుడు నిక్ కార్ట్ సోనిస్' ఓ ప్రకటనలో తెలిపారు.