ఘనాలో భారీ పేలుడు.. 17 మంది మృతి.. వందల సంఖ్యలో ఇళ్లు నేలమట్టం
Massive explosion rocks town in Ghana.ఆఫ్రికా దేశమైన ఘనాలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు పదార్థాలను
By తోట వంశీ కుమార్ Published on 21 Jan 2022 8:27 AM ISTఆఫ్రికా దేశమైన ఘనాలో గురువారం భారీ పేలుడు సంభవించింది. పేలుడు పదార్థాలను తీసుకువెలుతున్న ఓ ట్రక్కును ద్విచక్రవాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో 17 మంది దుర్మరణం చెందగా.. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. బంగారు గనులకు నిలయమైన బొగొసో పట్టణానికి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు.
వివరాల్లోకి వెళితే.. ఘనాకు పశ్చిమ దిశలోని బొగొసో పట్టణం బంగారు గనులకు నిలయం. ఇక్కడ ఓ బంగారు గనిలోకి పేలుడు పదార్థాలు తీసుకువెలుతున్న ఓ ట్రక్కును ఓ బైక్ ఢీ కొట్టింది. ఈ క్రమంలో తొలుత బైక్‌లో మంటలు చెలరేగాయి. అవి ట్రక్కుకు వ్యాపించగా.. పేలుడు పదార్థాలకు అంటుకోవడంతో పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. పేలుడు తీవ్రతకు సమీపంలో ఉన్న 500 వందలకు పైగా ఇళ్లు నేలమట్టం అయ్యాయని, ఘటనాస్థలంలోనే 17 మంది మృతి చెందగా, మరో 59 మందికి పైగా గాయపడ్డారని నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సంస్థ అధికారలు తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. భారీ పేలుడు సంభవించడంతో అక్కడ ఎటూ చూసిన కుప్పకూలిన ఇండ్లే దర్శనమిస్తున్నాయి.
ఇది చాలా బాధాకరమైన విషయమని, దురదృష్టకరమైనదని ఆ దేశ అధ్యక్షుడు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఘటనలో ఎంత మంది మరణించారు అనేది ఇంకా ప్రభుత్వం ప్రకటించలేదు.స్థానిక మీడియా వెల్లడించిన సమాచారం మేరకు 17 మంది మృతి చెందారు. ఇంకా ఎక్కువ సంఖ్యలోనే మృతులు ఉన్నట్లు తెలిపింది. ఇక ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
#UPDATE | 17 dead, 59 injured in explosion in western Ghana, says its govt: AFP
— ANI (@ANI) January 21, 2022
ఇక ఘనా దేశంలో ఇలాంటి ఘటనలు కొత్తేమీ కాదు. 2015లో ఇలాంటి ప్రమాదంలోనే 150 మంది మరణించారు. 2017లో ఆక్రా సమీపంలో గ్యాస్ ట్యాంకర్ పేలిన ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. డజన్ల కొద్ది గాయపడ్డారు.