నైజీరియాలో దారుణం.. 43 మంది రైతుల గొంతు కోసి చంపేశారు

Massacre Of Farmers In Nigeria .. నైజీరియాలో దారుణం చోటుచేసుకుంది. పొలం ప‌నుల‌కు వెళ్లిన రైతుల‌ను బోకో హ‌ర‌మ్ మిలిటెం

By సుభాష్  Published on  30 Nov 2020 5:31 AM GMT
నైజీరియాలో దారుణం.. 43 మంది రైతుల గొంతు కోసి చంపేశారు

నైజీరియాలో దారుణం చోటుచేసుకుంది. పొలం ప‌నుల‌కు వెళ్లిన రైతుల‌ను బోకో హ‌ర‌మ్ మిలిటెంట్లు అతికిరాత‌కంగా చంపేశారు. ఒకరు కాదు ఇద్ద‌రు కాదు మొత్తం 43 మంది రైతుల చేతులు, కాళ్లూ క‌ట్టేసి అతికిరాతంగా గొంతు కోసి చంపేశారు. అదే చోట ప‌నికి వెళ్లిన మరికొంత మంది రైతుల ఆచూకీ తెలియాల్సి ఉంది. ఈ అమానవీయ ఘటనతో నైజీరియా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇస్లామిక్ మిలిటెంట్ల పనిగా నైజీరియా భావిస్తోంది. నైజీరియాలోని బోర్నో రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది.

ఈశాన్య నైజీరియాలో వరి వ్యవసాయానికి ప్రసిద్ధి చెందిన బోర్నో కమ్యూనిటీ అయిన గారిన్ క్వాషి బేలోని వరి పొలంలో శనివారం ఈ దాడి జరిగింది. స్థానిక ప్రభుత్వ మండలిని ఎన్నుకోవటానికి ఆ రాష్ట్ర నివాసితులు 13 సంవత్సరాలలో మొదటిసారి ఓట్లు వేస్తున్నారు. అయినప్పటికీ చాలామంది వారి ఓట్లు వేయడానికి వెళ్ళలేదు. సాయుధ తిరుగుబాటుదారులు అందరూ ఈ రైతులను చుట్టుముట్టి వారిని గొంతు కోసి చంపారు. ఈ ఘటనతో యావత్ ప్రపంచం ఒక్క సారిగా ఉలిక్కిపడింది. మరోవైపు ఈ ఘటనపై స్పందించిన నైజీరియా అధ్యక్షుడు మహ్మద్ బుహారీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనిని అమానుష ఘటనగా ఆయన అభివర్ణించారు.

చనిపోయిన వారందరికీ నైజీరియా ప్రభుత్వం సామూహిక అంత్యక్రియలు నిర్వహించింది. ఇంకా చాలా మంది రైతులు అదృశ్యమైనట్లు తెలిసింది. కనిపించకుండా పోయిన వారిలో 10 మంది మహిళలు కూడా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. గత సంవత్సర కాలంగా నైజీరియాలో ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో.. పంటలు సాగు చేసుకుని కడుపు నింపుకునేందుకు ప్రయత్నిస్తున్న రైతుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోవడం శోచనీయం. అయితే అసలు వారిని ఎందుకు చంపారు, దానికి కారణం ఏమిటి అనే విషయాలు మాత్రం తెలియాల్సి ఉంది.

Next Story