విమాన చక్రం వద్ద మృతదేహం
Man's Body Found In Wheel Of Airplane.విమానాశ్రయంలో ప్రయాణీకులతో ఓ విమానం
By తోట వంశీ కుమార్ Published on 25 Dec 2022 11:19 AM ISTవిమానాశ్రయంలో ప్రయాణీకులతో ఓ విమానం ల్యాండైంది. అందరు ప్రయాణీకులు దిగిపోయారు. సాధారణ తనిఖీల్లో భాగంగా సిబ్బంది విమానాన్ని పరిశీలిస్తున్నారు. ఇంతలో విమానం చక్రం కింద మనిషి మృతదేహం కనిపించడంతో షాక్ తిన్నారు. ఈ ఘటన లండన్‌లోని గాట్విక్ విమానాశ్రయంలో చోటు చేసుకుంది.
గాంబియా రాజధాని బంజుల్ నుండి లండన్‌లోని గాట్విక్ విమానాశ్రయానికి చేరుకున్న బ్రిటిష్ చార్టర్ ఎయిర్‌లైన్ అయిన టీయూఐ ఎయిర్‌వేస్ నిర్వహిస్తున్న విమానం యొక్క వీల్ బేలో ఓ గుర్తు తెలియని నల్లజాతీయుడి మృతదేహాన్ని గుర్తించినట్లు గాంబియా ప్రభుత్వ ప్రతినిధి ఎబ్రిమా జి సంకరే ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విమానం డిసెంబర్ 5న బంజుల్ నుంచి టేకాఫ్ అయినట్లు వెల్లడించారు.
ఆ మృతదేహాం ఓ పురుషుడిది అని చెప్పారు. కాగా.. అతడి పేరు, వయస్సు, జాతీయత, ప్రయాణ చరిత్ర, తమ దేశానికి చెందిన వాడా కాదా..? అన్నది ఇంకా తెలియాల్సి ఉందన్నారు. బ్రిటన్ పోలీసులు ఆ మృతదేహానికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ అంశంలో బ్రిటన్ పోలీసులకు అన్ని విధాలా సహకరిస్తామని తెలిపారు.
ఆఫ్రికా దేశాల నుంచి ఐరోపాకు కొందరు అక్రమంగా వలస వెలుతుంటారు. వీరు దొంగ చాటుగా విమాన చక్రాల వద్ద నక్కి ప్రయాణిస్తుంటారు. ఈ క్రమంలో కొందరు మృత్యువాత పడిన ఘటనలు ఉన్నాయి.