గాంధీజీ మునిమనవరాలికి ఏడేళ్ళ జైలుశిక్ష.. ఎందుకంటే..?
Mahatma Gandhi's great grandaughter sentenced to 7 years in jail.మహాత్మా గాంధీ ముని మనవరాలు ఆశిష్ లతా రామ్‌గోబిన్ కు
By తోట వంశీ కుమార్ Published on 8 Jun 2021 6:07 AM GMT
మహాత్మా గాంధీ ముని మనవరాలు ఆశిష్ లతా రామ్‌గోబిన్ కు ఏడేళ్ల జైలు శిక్ష పడింది. మోసం, ఫోర్జరీ కేసులో ఆమెను దోషిగా తేల్చిన దక్షిణాఫ్రికాలోని డర్బన్ కోర్టు ఆమెకు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. 56 ఏళ్ల ఆశిష్ లతా రామ్‌గోబిన్ వ్యాపారవేత్త మహరాజ్‌ను మోసం చేసినట్లు నిరూపితమైందని కోర్టు పేర్కొంది. దక్షిణాఫ్రికాలోని ప్రముఖ మానవహక్కుల కార్యకర్త ఈలా గాంధీ కుమారై లతా రాంగోబిన్.. అహింసపై ఏర్పాటైన ఓ ఎన్జీవోలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. పర్యావరణ హక్కుల కార్యకర్తగానూ పనిచేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. న్యూ ఆఫ్రికా లియన్స్ పుట్‌వేర్ డిస్ట్రిబ్యూటర్ కంపెనీ డైరెక్టర్ ఎస్ఆర్ మహరాజ్‌ను 2015 ఆగస్టులో లతా రాంగోబిన్ కలిసారు. లినెన్ వస్త్రాలతో ఉన్న మూడు కంటైనర్లు భారత్ నుంచి దిగుమతి చేసుకున్నానని, అయితే.. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కస్టమ్స్ సుంకాన్ని చెల్లింకపోతున్నానని తెలిపారు. తనకు సాయం కావాలని అడిగారు. ఇందుకు గానూ లాభాల్లో షేర్ ఇస్తానని హామీ ఇచ్చారు. లినెన్ ఉత్పత్తులను ఆర్డర్ చేసినట్లుగా కొన్ని పత్రాలు, ఇన్‌వాయిస్‌లు ఫ్రూఫ్ లుగా చూపించారు.
దీంతో మహారాజ్ ఆమెతో ఒప్పందం చేసుకున్నారు. 6.2 మిలియన్ రాండ్ల నగదు(రూ.3.23 కోట్లు) ఇచ్చారు. అయితే.. భారత్ నుంచి ఎలాంటి దిగుమతులు చేసుకోలేదని కొద్ది రోజులకు మహరాజ్‌కు తెలిసింది. దీంతో లతా రాంగోబిన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 2015లో విచారణ ప్రారంభం కాగా.. ఆమె బెయిల్‌పై బయటకు వచ్చారు. సోమవారం డర్బన్ కోర్టు తుది తీర్పును వెలువరించింది. ఈ కేసులో ఆమెను దోషిగా తేలుస్తూ 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అంతేకాదు.. ఈ తీర్పుపై అప్పీలు చేసుకునే అవకాశం కూడా ఇవ్వడం లేదని చెప్పింది.