హ‌మ్మ‌య్య‌.. ముప్పు త‌ప్పింది.. స‌ముద్రంలో ప‌డింది

Long March 5B lands in Indian Ocean.చైనా రాకెట్ లాంగ్ మార్చ్ 5బీ ముప్పు త‌ప్పింది స‌ముద్రంలో ప‌డింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 May 2021 4:51 AM GMT
Long March 5B rocket

చైనా రాకెట్ లాంగ్ మార్చ్ 5బీ.. గ‌త కొన్ని రోజులుగా ప్ర‌పంచాన్ని ముప్పు తిప్ప‌లు పెట్టింది. ఈ రాకెట్ నియంత్ర‌ణ కోల్పోవ‌డంతో భూమిపై ఎక్క‌డ కూలుతోందో అని ఎంతో మంది ప్రాణాల‌ను అరచేతిలో పెట్టుకున్నారు. అయితే.. ఎట్ట‌కేల‌కు ఈ అతిపెద్ద రాకెట్ హిందూ మ‌హాస‌ముద్రంలో కూలిపోవ‌డంతో అంద‌రూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ రాకెట్ భూ వాతావ‌ర‌ణంలోకి ప్ర‌వేశించ‌గా.. చాలా వ‌ర‌కు శ‌క‌లాలు పూర్తిగా మండిపోగా.. కొన్ని భాగాలు మాత్రం హిందూమ‌హాస‌ముద్రంలో ప‌డిన‌ట్లు చైనా మీడియా వెల్ల‌డించింది.

బీజింగ్ కాల‌మానం ప్ర‌కారం ఆదివారం ఉద‌యం 10:24 గంట‌ల (భార‌త స‌మ‌యం ఉద‌యం 07:54)కు లాంగ్ మార్చ్ 5బీ రాకెట్ భూవాతావ‌ర‌ణంలోకి తిరిగి ప్ర‌వేశించింది. ఆ త‌ర్వాత 72.47 డిగ్రీల తూర్పు రేఖాంశం, 2.65 డిగ్రీల ఉత్త‌ర అక్షాంశాల ద‌గ్గ‌ర కూలిపోయిన‌ట్లు చైనా మ్యాన్‌డ్‌ స్పేస్ ఇంజినీరింగ్ ఆఫీస్ వెల్ల‌డించిన‌ట్లు చైనీస్ మీడియా తెలిపింది. అంత‌రిక్ష కేంద్రం నిర్మాణ ప‌నుల్లో భాగంగా చైనా గ‌త నెల 29న లాంగ్ మార్చ్ 5బీ అనే భారీ రాకెట్‌ను ప్ర‌యోగించింది. అంత‌రిక్ష కేంద్ర కోర్ మాడ్యూల్‌ను అది విజ‌య‌వంతంగా మోసుకెళ్లింది.

అయితే.. ఆ రాకెట్ నియంత్ర‌ణ కోల్పోవ‌డంతో.. దాని శ‌క‌లాలు స‌ముద్ర జలాల్లో కాకుండా సాధార‌ణ భూభాగంపై ప‌డిపోయే ముప్పు ఉంద‌ని అంత‌రిక్ష రంగ నిపుణ‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. నిజానికి భూమిపై ఎక్కువ భాగం నీళ్లే ఉండ‌టం వ‌ల్ల ఇలాంటి రాకెట్లు జ‌నావాసాల‌పై ప‌డ‌టం చాలా చాలా అరుదు అని నిపుణులు చెబుతున్నారు.


Next Story