సూయజ్ కాలువలో చిక్కుకున్న భారీ నౌక.. బారులు తీరిన ఓడలు
Large container ship blocks Suez Canal. సూయజ్ కాలువలో ఓ భారీ కంటైనర్ నౌక చిక్కుకుంది. కాలువలో నౌక అడ్డం తిరగడంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామైంది.
By తోట వంశీ కుమార్ Published on 24 March 2021 1:34 PM ISTప్రపంచ వ్యాపారానికి సూయజ్ కాలువ జీవనాడి లాంటిది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 60శాతానికి పైగా సరుకు రవాణా ఈ కాలువ ద్వారానే జరుగుతున్నాయి. యూరప్, ఆసియాల మధ్య జలరవాణా కొరకు ఆఫ్రికాను చుట్టిరాకుండా ఉండేందుకు దగ్గరి దారి ఇదే. ఈ కాలువను 1869లో ప్రారంభించారు. మధ్యధరా సముద్రానికి, ఎర్రసముద్రానికి మధ్య ఓ వారధి లాగా ఉంటుంది. ఈ కాలువ పొడవు 192 కి.మీ. అంతటి ప్రాముఖ్యమైన కాలువలో ఓ భారీ కంటైనర్ నౌక చిక్కుకుంది. కాలువలో నౌక అడ్డం తిరగడంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామైంది. దీంతో ఆ మార్గంలో వెళ్లాల్సిన సరుకు రవాణా బోట్లు ఎక్కిడివక్కడ నిలిచిపోయాయి.
400మీటర్ల పొడవు, 59 మీటర్ల వెడల్పు ఉన్న ది ఎవర్ గ్రీన్ అనే కంటైనర్ మంగళవారం ఉదయం సూయజ్ ఉత్తర భాగంలో ప్రయాణించింది. ఆ సమయంలో ఒక్కసారిగా అదుపుతప్పి కాల్వలో అడ్డంతిరిగింది. దీంతో ఒక వైపు ఇసుకులో కూరుకుపోయినట్లు అనుమానిస్తున్నారు. ఈ నౌకను పక్కకు జరిపేందుకు తగ్ బోట్లను పంపించారు. ఆ నౌకను మళ్లీ సరైన మార్గంలోకి తెచ్చేందుకు కొన్ని రోజులు పట్టే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని వల్ల ఆసియా-యూరప్‌ల మధ్య వాణిజ్యంపై ప్రభావం పడే అవకాశం ఉంది.
ఎవర్ గ్రీన్ నౌక పనామాలో రిజిస్టరై ఉంది. నెదర్లాండ్స్‌లోని రోటర్‌డ్యామ్‌కు అది వెళ్తోంది. చైనా నుంచి వస్తున్న ఈ నౌక మధ్యదరా సముద్రానికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. తైవాన్‌కు చెందిన ట్రాన్స్‌పోర్ట్ కంపెనీ ఎవర్‌గ్రీన్ మెరైన్ ఈ నౌకను ఆపరేట్ చేస్తున్నది. అయితే బలమైన గాలులు వీయడం వల్ల నౌక జలమార్గానికి అడ్డు తిరిగినట్లు తెలుస్తోంది. సముద్రం పోటెత్తినప్పుడు గనుక ఆ నౌకను తిరిగి దారిలోకి తీసుకురాలేకపోతే.. దానిలోని కంటైనర్లను దింపాల్సి ఉంటుంది. ఇందుకు చాలా రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ ప్రమాదం ప్రపంచ వాణిజ్యంపై ఖచ్చితంగా ప్రభావం చూపుతుందని నౌకాయాన నిపుణులు భావిస్తున్నారు.