పెట్రోల్‌పై రూ.50, డీజిల్‌పై రూ.75 పెంపు
Lanka IOC hikes fuel prices yet again.ఉక్రెయిన్ పై రష్యా చేపట్టిన సైనిక దాడి అంతర్జాతీయంగా ముడి చమురు సరఫరాపై
By తోట వంశీ కుమార్ Published on 11 March 2022 11:16 AM GMTఉక్రెయిన్ పై రష్యా చేపట్టిన సైనిక దాడి అంతర్జాతీయంగా ముడి చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే పలు దేశాలు రష్యా నుంచి ముడి చమురు దిగుమతులపై ఆంక్షలు విధించాయి. దీంతో చాలా దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. మూలిగే నక్కపై తాటికాయ పడినట్లు అన్నచందంగా శ్రీలంక పరిస్థితి తయారైంది. ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న లంక లో ఇంధన ధరలను పెంచుతున్నట్లు లంక ఇండియన్ ఆయిల్ కంపెనీ(ఎల్ఐఓసీ) ప్రకటించింది. లీటర్ పెట్రోల్ పై రూ.50, డీజిల్‌పై రూ.75 పెంచుతున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే లంకలో లీటర్ పెట్రోల్ ధర రెండు వందలు దాటగా.. తాజా పెంపుతో లీటర్ పెట్రోల్ ధర రూ.254, డీజిల్ ధర రూ.214కి చేరింది.
శ్రీలంక రూపాయి విలువ భారీగా పతనం కావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎల్ఐఓసీ మేనేజింగ్ డైరెక్టర్ మనోజ్ గుప్తా తెలిపారు. డాలర్‌తో పోలిస్తే శ్రీలంక రూపాయి విలువ రూ.57 తగ్గింది. ఇలా క్షీణించడం ఈ వారంలో ఇది రెండోసారి అని అన్నారు. ఇది చమురు, గ్యాసోలిన్ ఉత్పత్తుల ధరను నేరుగా ప్రభావితం చేసిందని.. ఫలితంగా ఇంధన ధరల పెరుగుదలకు దారి తీసినట్లుగా చెప్పుకొచ్చారు. ఇక లంక ప్రభుత్వం నుంచి తమ సంస్థ ఎటువంటి రాయితీలు పొందదని.. దీంతో అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిణామాలతో సంస్థ నష్టపోతుందన్నారు. ఈ నష్టాల నుంచి బయట పడాలంటే ఇంధన ధరలు పెంచడం తప్ప వేరే మార్గం లేదన్నారు. ధరలు పెంచినప్పటికీ నష్టాలు తప్పడం లేదన్నారు.