నిన్ను చూస్తే ఎంతో గర్వంగా ఉంది.. కమలా హారిస్ భర్త ఉద్వేగ పోస్టు
Kamala harrish Husband Emotional Post.. అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ విజయం సాధించిన విషయం
By సుభాష్ Published on 11 Nov 2020 11:19 AM GMTఅగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా సరికొత్త చరిత్ర సృష్టించిన భారత సంతతి మహిళ కమలా హారిస్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కొనసాగుతోంది. ఆమె అమెరికా తొలి ఉపాధ్యక్షురాలిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న సందర్భంగా భారతీయులతో పాటు జమైకన్లు సైతం తమ ఆడ పడుచు విజయాన్ని ఆస్వాదిస్తూ తనను అభినందిస్తున్నారు.
ఇక సెకండ్ ఎంటిల్మెన్ హోదా చేపట్టనున్న కమలా హారిస్ భర్త డగ్లస్ ఎమాఫ్‌కు సైతం శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ క్రమంలో డగ్లస్ ఎమాఫ్ షేర్ చేసిన ఫోటో ప్రస్తుతం సోషల్‌మీడియాలో నెటిజన్లను సైతం ఆకట్టుకుంటోంది. అటార్నీ జనరల్‌గా సెనెటర్‌గా కీలక బాధ్యతలు చేపట్టనున్న నా భార్య ఏకంగా దేశంలో తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా ఉన్నత శిఖరాలు అధిరోహించిన వేళ తన గుండె గర్వంతో ఉప్పొంగిపోతోందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఆత్మీయంగా హత్తుకుని ఉన్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన డగ్లస్... నిన్ను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది అంటూ ఉద్వేగపూరిత క్యాప్షన్ జోడించి పోస్టు చేశారు. ఇందుకు నెటిజన్లు సైతం స్పందించారు. కమలా హారిస్‌ను చూసి అమెరికా మొత్తం గర్వపడుతోంది. ఒక మహిళగా, నల్లజాతి స్త్రీగా ఆమె సాధించిన విజయం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఒక మహిళకు ఈ పదవి దక్కడం ఇదే తొలిసారి
కాగా, భారత సంతతి మహిళ కమలా హ్యారిస్ అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యింది. అగ్రరాజ్య చరిత్రలో ఇప్పటి వరకు ఒక మహిళ, ఒక ఆసియన్ అమెరికన్‌కు ఈ పదవికి దక్కడం ఇదే తొలిసారి. ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యి కమలా హ్యారిస్ కొత్త చరిత్ర సృష్టించింది. ఆమె ఇంతకుముందు కూడా ఎన్నో ఘనతలు సాధించారు. 1964 అక్టోబర్ 20న ఒక్లాండ్‌లో జన్మించిన కమలా హ్యారిస్ తల్లి తమిళనాడులోని సంప్రదాయ కుటుంబానికి చెందినవారు. తండ్రి జమైకా దేశస్తుడు. వాషింగ్టన్ డీసీలోని హోవార్డ్ యూనివ ర్సిటీలో కమల చదువుకున్నారు. యూసీ హేస్టింగ్స్ కాలేజీలో న్యాయ విద్య అభ్యసించారు. అలమెండా కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయంలో ఎనిమిది సంవత్స రాలు పనిచేశారు. ప్రధానంగా చిన్నారులపై జరిగే హింసకు సంబంధించిన కేసులను విచారించారు.
ఆ తర్వాత శాన్‌ఫ్రాన్సిస్కో జిల్లా అటార్నీ పదవిని అధిరోహించిన తొలి మహిళగా ఆమె కీర్తిగడించారు. అనంతరం కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా సేవలందించిన మహిళగానూ రికార్డుకెక్కారు. అప్పుడే ఈమె మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా దృష్టిలో పడ్డారు. అనంతరం డెమొక్రటిక్ పార్టీలో చేరారు. కాలిఫోర్నియా సెనేటర్‌గా ఎన్నికయ్యారు.