జో బైడెన్ కు ఏమైంది.. పట్టుదప్పి పడిపోయిన అమెరికా అధ్యక్షుడు

JOE Biden trips air force one white house.అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పట్టుదప్పారు. అధికారిక విమానం ఎయిర్ ఫోర్స్ వన్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 March 2021 9:21 AM GMT
జో బైడెన్ కు ఏమైంది.. పట్టుదప్పి పడిపోయిన అమెరికా అధ్యక్షుడు

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పట్టుదప్పారు. అధికారిక విమానం ఎయిర్ ఫోర్స్ వన్ ఎక్కుతుండగా మెట్లపై పడ్డారు. రెండు మూడు సార్లు అలాగే జరిగింది. ఏషియన్ అమెరికన్లపై జరుగుతున్న దాడులపై చర్చించేందుకు, వారికి భరోసానిచ్చేందుకు శుక్రవారం ఆయన అట్లాంటా వెళుతుండగా ఈ ఘటన జరిగింది. బయట గాలుల తీవ్రత ఎక్కువగా ఉండడం వల్లే ఆయన ఒరిగారని వైట్ హౌస్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ కెరీన్ జీన్ పియర్ విలేకరులకు చెప్పారు. తాను కూడా మెట్లు ఎక్కుతూ పడిపోబోయానన్నారు. బైడెన్ కు ఏమీ కాలేదని, ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అయింది.

జో బైడెన్ వయసు 78 సంవత్సరాలు అనే సంగతి ప్రపంచానికి తెలుసు. అమెరికాకు అత్యంత వృద్ధ అధ్యక్షుడిగా సరికొత్త రికార్డు సృష్టించారు. 78 ఏళ్ల వయసులో స్వల్ప అనారోగ్య సమస్యలు సహజమే.. కానీ ఇటీవలి కాలంలో చోటు చేసుకున్న ఘటనల కారణంగా ఆయన ఆరోగ్యంపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. బైడెన్‌ ఈ మధ్య తరచుగా తడబడుతున్నారు. పేర్లు, హోదాలు చెప్పే విషయంలోనూ తికమక పడుతున్నారు. ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ను ప్రెసిడెంట్‌ హ్యారిస్‌ అని సంబోధించడం కూడా హాట్ టాపిక్ గా నిలిచింది. ఇక శుక్రవారం తన అధికారిక విమానం ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ ఎక్కేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డారు.

జాయింట్‌ బేస్‌ ఆండ్రూస్‌ నుంచి అట్లాంటాకు ఎయిర్‌ఫోర్స్‌ వన్‌లో బయలుదేరిన బైడెన్‌ మెట్లపై పలుమార్లు కిందపడ్డారు. అతికష్టం మీద రెయిలింగ్‌ పట్టుకొని పైకి లేచారు. దీంతో ఆయన ఆరోగ్యంపై అమెరికా ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయనకు ఏమైందా అని పలువురు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని వైట్ హౌస్ మాత్రం స్పష్టం చేస్తోంది.


Next Story