జపాన్ మాజీ ప్రధాని షింజో అబే కన్నుమూత

Japan former PM Shinzo abe shot dead. జపాన్ మాజీ ప్రధాని షింజో అబే (67) కన్నుమూశారు. శుక్ర‌వారం నారా న‌గ‌రంలో లిబ‌ర‌ల్ డెమొక్రిటిక్ పార్టీ అభ్య‌ర్థుల త‌రుపున

By అంజి  Published on  8 July 2022 3:06 PM IST
జపాన్ మాజీ ప్రధాని షింజో అబే కన్నుమూత

జపాన్ మాజీ ప్రధాని షింజో అబే (67) కన్నుమూశారు. శుక్ర‌వారం నారా న‌గ‌రంలో లిబ‌ర‌ల్ డెమొక్రిటిక్ పార్టీ అభ్య‌ర్థుల త‌రుపున ప్ర‌చారం చేస్తూ స్టేజిపై ప్ర‌సంగిస్తుండ‌గా దుండ‌గుడు ఆయ‌న‌పై కాల్పులు జ‌రిపాడు. దీంతో ఆయ‌న వేదిక‌పైనే కుప్ప‌కూలిపోయారు. వెంట‌నే ఆయ‌న్ను ఆస్ప‌త్రికి త‌రలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆబే కన్నుమూసినట్లు ఆ దేశ మీడియా ప్రకటించింది.

ఆదివారం పార్లమెంట్ ఎగువ సభకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే నారా ప్రాంతంలోని ఓ కాలనీలో అబే ప్రసంగిస్తుండగా ఆయనపై దాడి జరిగింది. దుండగుడి కాల్పులతో అబేకు తీవ్ర రక్తస్రావమైంది. అప్పటికే ఎలాంటి కదలికలు లేని ఆయనను ఆస్పత్రికి తరలించారు. అయితే ఆయన కార్డియో పల్మనరీ అరెస్ట్ పరిస్థితిలో ఉన్నారని టోక్యో మాజీ గవర్నర్ కాసేపటికి వెల్లడించారు. చాలా సమయం గడిచిన తర్వాత అబే మరణించారన్న వార్తను అక్కడి మీడియా ధ్రువీకరించింది. జపాన్‌కు సుదీర్ఘకాలంగా అబే ప్రధానిగా పని చేశారు. 2020లో ఆరోగ్య కారణాల వల్ల ప్రధాని పదవి నుంచి తప్పుకున్నారు.

షింజో అబే మరణంపై వివిధ దేశాల నేతలు సంతాపం తెలుపుతున్నారు. అబే మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ప్రధాని మోదీ అన్నారు. అబే గొప్ప రాజనీతిజ్ఞుడు అని, అద్భుతమైన నేత, పాలకుడు అని కొనియాడారు. అబే తన జీవతం మొత్తాన్ని జపాన్, ప్రపంచ సంక్షేమం కోసమే అంకితం చేశారని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

Next Story