తెగిన తీగలు.. కొండల్లో పడిన కేబుల్ కారు.. 14 మంది మృతి
Italy cable car fall down,14 dead.ఇటలీలో ఓ కేబుల్ కారు తీగలు తెగాయి. దీంతో ఆ కేబుల్ కారు కొండల్లో పడిపోయింది.
By తోట వంశీ కుమార్ Published on 24 May 2021 6:23 AM GMTఇటలీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కేబుల్ కారు తీగలు తెగాయి. దీంతో ఆ కేబుల్ కారు కొండల్లో పడిపోయింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందగా.. మరో ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం ఈ దుర్షటన జరిగింది.
ఇటలీ ఉత్తర భాగంలో ఉన్న మజియోరే సరస్సు అందాలను చూసేందుకు యాత్రికులు పెద్ద ఎత్తున వస్తుంటారు. ఈ అందాలను చూసేందుకు వీలుగా.. రిసార్ట్ టౌన్ స్ట్రెసా నుంచి పీడ్మాంట్ ప్రాంతంలోని మోటరోనే కొండపైకి కేబుల్ కారు మార్గాన్ని ఏర్పాటు చేశారు. మోటరోనే కొండపైకి మరో 100 మీటర్ల దూరం ఉందనగా.. కేబుల్ తెగిపోయింది. చాలా ఎత్తు నుంచి కొండల మధ్యలో పడడంతో ఆ కేబుల్ కారు నుజ్జు నుజ్జు అయ్యింది. పల్టీలు కొడుతూ.. ఓ చెట్టును ఢీకొని ఆగిపోయింది. ఘటనా స్థలంలోనే 14 మంది మృతి చెందారు.
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ టీమ్ వెంటనే అక్కడి చేరుకుంది. తొమ్మిది, ఐదు సంవత్సరాలున్న ఇద్దరు చిన్నారులను రక్షించి వారిని హెలికాప్టర్‌లో టూరిన్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి ఇంకా కారణాలు తెలియరాలేదు. కొండపైన 300మీ(983 అడుగులు) ఎత్తులో కేబుల్ కారు తెగిపోయి ఉండవచ్చునని అక్కడి స్థానిక మీడియా వెల్లడించింది. సముద్ర మట్టానికి 1,491 మీటర్ల ఎత్తులో ప్రయాణీలకు తీసుకెళ్లి దింపడానికి సాధారణంగా 20 నిమిషాలు పడుతుందని స్ట్రెసా-ఆల్పైన్-మోటరోనే కేబుల్ కారు వెబ్‌సైట్ తెలిపింది. 2016లోనే ఈ కేబుల్ లైన్‌ను పునర్నిర్మించారని స్టెసా మేయర్ మార్సెల్లా సెవెరినో తెలిపారు. కరోనా కారణంగా మూతబడిన ఈ పర్యాటక ప్రదేశాన్ని.. ఇటీవలే తెరిచారన్నారు.