గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడి, 200 మందికి పైగా మృతి

గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ దళాలు మరోసారి విరుచుకుపడ్డాయి

By Knakam Karthik
Published on : 18 March 2025 12:59 PM IST

Internationa News, Israel, Gaza Palestine,  Israeli Military

గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడి, 200 మందికి పైగా మృతి

కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగింపుపై చర్చలకు సిద్ధమవుతుండగా, గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ దళాలు మరోసారి విరుచుకుపడ్డాయి. సోమవారం రాత్రి నుంచి పలు ప్రాంతాల్లో భీకర దాడులు చేపట్టింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 200 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. మరో 300 మంది వరకు గాయపడినట్లు గాజా ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.

మరోవైపు ఈ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు కీలక ప్రకటన చేశారు. కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగింపునకు హమాస్ అంగీకరించని కారణంగానే దాడులకు ఆదేశించినట్లు వెల్లడించారు. "మా బందీలను విడుదల చేయడానికి హమాస్‌ పదేపదే నిరాకరిస్తుంది. అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్‌ విట్‌కాఫ్‌ ప్రతిపాదించిన కాల్పుల ఒప్పందం కొనసాగింపును హమాస్ తిరస్కరించింది. ఈ క్రమంలోనే దాడులకు ఆదేశించాం. యుద్ధం లక్ష్యాలను సాధించడానికి గాజాలోని హమాస్‌ స్థావరాలే టార్గెట్​గా ఐడీఎఫ్‌ దాడులు చేస్తోంది" అని ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు.

ఇటీవల ఇజ్రాయెల్‌- హమాస్‌ల మధ్య తొలి దశ కాల్పుల విరమణ ఒప్పందం ముగిసింది. ఇందులో భాగంగా దాదాపు 30మందికి పైగా తమ చెరలోని బందీలను మిలిటెంట్‌ సంస్థ విడుదల చేయగా, ప్రతిగా 2 వేల మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్‌ రిలీజ్ చేసింది. ఈ క్రమంలోనే రెండో దశ కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చలు జరగాల్సి ఉండగా, అమలు దిశగా అడుగులు పడలేదు. మరోవైపు రంజాన్‌ నేపథ్యంలో తొలి దశ ఒప్పందాన్ని ఏప్రిల్‌ 20 వరకు కొనసాగించాలని అమెరికా ప్రత్యేక రాయబారి ప్రతిపాదనలు చేశారు. దీనికి ఇజ్రాయెల్ అంగీకరించగా హమాస్ మాత్రం నిరాకరించింది. ఈ నేపథ్యంలో హమాస్‌పై ఒత్తిడి తెచ్చేందుకు నెతన్యాహు చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే గాజాకు వెళ్లే మానవతా సాయాన్ని అడ్డుకోడంతో పాటు విద్యుత్ సరఫరాను ఇజ్రాయెల్‌ నిలిపివేసింది.

Next Story