లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు.. సిరియాకు 10లక్షల మంది

లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on  30 Sep 2024 9:45 AM GMT
లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు.. సిరియాకు 10లక్షల మంది

లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ప్రజలు నిరాశ్రయులు అవుతున్నారు. అంతేకాదు.. ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ వైమానిక దాడుల నేపథ్యంలో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. లక్షలాది మంది సరిహద్దులు దాటి సిరియాకు క్యూ కడుతున్నారు. అయితే.. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇప్పటిదాకా ఏకంగా 10 లక్షల మంది ప్రాణభయంతో పారిపోయినట్లు ప్రధాని నజీబ్‌ మికాటీ వెల్లడించారు. లెబనాన్‌లో ఆరో వంతు జనాభా దేశం దాటుతుండటం ఆందోళన రేకిస్తోంది. అంతేకాదు.. లెబనాన్ నుంచి ఇదే అతిపెద్ద వలస అని చెబుతున్నారు. ఎక్కువ మొత్తంలో ప్రజలు లెబనాన్‌ను వదలివెళ్లడంపై ఆ దేశ ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు.

హెజ్‌బొల్లా స్థావరాలపై దాడుల క్రమంలో ప్రజలు ఇళ్లలో ఉండటమే లేదు. చాలా మంది వీధులు, సముద్రతీరం, పబ్లిక్ స్క్వేర్లు, తాత్కాలిక షెల్టర్లలో ఉంటున్నారు. రాత్రంతా అక్కడే నివాసం ఉంటున్నారు. కుటుంబాలకు కుటుంబాలు వీధుల్లోనే నిద్రపోతున్నాయి. ఇజ్రాయెల్‌ వరుస దాడుల నేపథ్యంలో లెబనాన్‌లోని ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారనేది వాస్తవం. ఏది ఏమైనా ప్రాణాలు కాపాడుకుంటే చాలంటూ వారు సిరియా వైపు వలస వెళ్తున్నారు. ఇంకొందరు లెబనాన్ రాజధాని ఎగువన ఉన్న పర్వతాలకు ర్యాలీగా వెళ్తున్నారు. పసిపిల్లలు, కొన్ని వస్తువులను వెంట తీసుకెళ్తున్నారు. 50వేల మందికి పైగా సిరియాకు ఇప్పటికే వెళ్లిపోయారని ఐక్యరాజ్యసమితి చెబుతోంది.

పెద్ద మొత్తంలో లెబనాన్ ప్రజలు సిరియాకే ఎందుకు వెళ్తున్నారని ప్రపంచ దేశాల్లోని ఇతర ప్రజలు ఆరా తీస్తుననారు. వారు సిరియాకు మాత్రమే వెళ్లడం వెనుక కారణం లేకపోలేదు. లెబనాన్ ప్రజలు సిరియాకు వెళ్లాలంటే డాక్యుమెంట్లు అవసరం లేదు. దాంతో.. ప్రతి గంటకు వందలాది మంది సిరియాకు వెళ్తున్నారు. పిల్లలకు వీడ్కోలు చెబుతూ తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకుంటున్నారు. లెబనాన్‌లో ఉన్న సంపన్నులు మాత్రం యూకేకు వెళ్తున్నారు.

Next Story