ప్ర‌ధాని నివాసంపై డ్రోన్ దాడి

Iraqi PM safe after drone attack on residence.దేశానికి ప్ర‌ధాని అంటే అత్యంత భద్రత ఉంటుంది. ఇక ఆయ‌న నివాసం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 Nov 2021 3:05 AM GMT
ప్ర‌ధాని నివాసంపై డ్రోన్ దాడి

దేశానికి ప్ర‌ధాని అంటే అత్యంత భద్రత ఉంటుంది. ఇక ఆయ‌న నివాసం చుట్టూ వంద‌ల సంఖ్య‌లో సైనికులు ప‌హారా కాస్తుంటారు. అంత‌టి ప‌టిష్ట భ‌ద్ర‌త‌ను దాటుకుని ప్ర‌ధానిపై హ‌త్యాయ‌త్నం జ‌రిగింది. ఆధునిక టెక్నాల‌జీని ఉప‌యోగించుకున్న దుండ‌గులు డ్రోన్ సాయంతో ప్ర‌ధాని నివాసంపై దాడి చేశాడు. ఆ డోన్ నిండా పేలుడు ప‌దార్థాల‌ను పెట్టి.. ప్ర‌ధాని నివాసంపై దాడికి పాల్ప‌డ్డారు. కాగా.. ఈ దాడి నుంచి ప్ర‌ధాని సురక్షితంగా బ‌య‌ట‌ప‌డ‌గా.. ఐదుగురు గాయ‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న ఇరాక్‌లోని బాగ్దాద్‌లో చోటు చేసుకుంది.

అక్క‌డి మీడియా వెల్ల‌డించిన వివ‌రాల మేర‌కు.. ఇరాక్ రాజ‌ధాని బాగ్దాద్‌లోని ప్ర‌ధాని అల్ క‌దిమి ముస్త‌ఫా నివాసంపై ఈరోజు(ఆదివారం) తెల్ల‌వారు జామున పేలుడు ప‌దార్థాల‌తో కూడిన డ్రోన్ తో దాడి జ‌రిగింది. కాగా.. ఈ దాడి నుంచి ప్ర‌ధాని సుర‌క్షితంగా బ‌య‌ట ప‌డిన‌ట్లు ఇరాక్ ఆర్మీ ప్ర‌క‌టించింది. అయితే.. ఐదుగురు గాయ‌ప‌డిన‌ట్లు అధికారులు తెలిపారు. ప్ర‌ధాని ల‌క్ష్యంగా డ్రోన్ దాడి జ‌ర‌గ‌డంతో అప్ర‌మ‌త్త‌మైన ఆర్మీ.. ప్ర‌ధానిని సుర‌క్షిత ప్రాంతానికి త‌ర‌లించింది.

తాను క్షేమంగా ఉన్నాన‌ని.. ప్ర‌జలంతా శాంతియుతంగా, సంయ‌మ‌నంతో ఉండాలని ప్ర‌ధాని ముస్త‌ఫా ట్వీట్ చేశారు. కాగా.. ఈ దాడికి పాల్ప‌డింది తామేన‌ని ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ఉగ్ర సంస్థ ప్ర‌క‌టించ‌లేదు.

Next Story