కొత్త సుప్రీం లీడర్‌గా మొజ్తబా ఖమేనీ.. ఇరాన్ అధికారిక ప్రకటన
ఇరాన్ రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత...
By - అంజి |
కొత్త సుప్రీం లీడర్‌గా మొజ్తబా ఖమేనీ.. ఇరాన్ అధికారిక ప్రకటన
ఇరాన్ రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత, ఆయన వారసుడిగా కుమారుడు మొజ్తబా ఖమేనీ (Mojtaba Khamenei) ఎంపికయ్యారు. ఇందుకు సంబంధించి ఇరాన్ 'అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్' అధికారిక ప్రకటన విడుదల చేసింది. అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో అయతుల్లా అలీ ఖమేనీ మరణించిన తర్వాత, ఇరాన్ అత్యున్నత పదవి కోసం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో, 56 ఏళ్ల మొజ్తబా ఖమేనీని ఇరాన్ మూడవ సుప్రీం లీడర్‌గా నియమిస్తున్నట్లు అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ ప్రకటించింది. టెహ్రాన్ కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి ఈ నిర్ణయాన్ని వెల్లడించారు.
శత్రువుల చేత అసహ్యించుకోబడే వ్యక్తియే ఇరాన్ నేతగా ఉండాలన్న అలీ ఖమేనీ మార్గదర్శకాల మేరకే ఈ ఎంపిక జరిగినట్లు కౌన్సిల్ సభ్యులు పేర్కొన్నారు. 1969లో మషాద్ నగరంలో జన్మించిన మొజ్తబా, చిన్నతనం నుంచే ఇరాన్ ఇస్లామిక్ విప్లవ పోరాటాలను దగ్గరుండి చూశారు. ఇరాన్-ఇరాక్ యుద్ధంలో కూడా పాల్గొన్నారు. ఇరాన్ శక్తివంతమైన సైనిక విభాగం 'ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్' (IRGC)తో ఆయనకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ప్రభుత్వం లో ఎప్పుడూ అధికారిక పదవిని నిర్వహించకపోయినప్పటికీ, తన తండ్రి కార్యాలయం ద్వారా ఇరాన్ రాజకీయాలను దశాబ్ద కాలంగా ప్రభావితం చేస్తూ వస్తున్నారు. 2019లో అమెరికా ప్రభుత్వం ఈయనపై ఆంక్షలు కూడా విధించింది. మొజ్తబా ఎంపికపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు.
వాషింగ్టన్ ఆమోదం లేని ఏ నేత అయినా ఇరాన్‌లో ఎక్కువ కాలం మనజాలరని ఆయన హెచ్చరించారు. "అతను మాకు ఆమోదయోగ్యం కాదు" అని ట్రంప్ స్పష్టం చేశారు. మరోవైపు, ఇరాన్ కొత్త నేతగా ఎవరు ఎన్నికైనా వారిని టార్గెట్ చేస్తామని ఇజ్రాయెల్ ఇప్పటికే హెచ్చరించడం మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలను మరింత పెంచుతోంది. సాధారణంగా ఇరాన్ ఇస్లామిక్ సిద్ధాంతం వారసత్వ పాలనను వ్యతిరేకిస్తుంది. అయితే, మొజ్తబాకు సైనిక దళాల్లో ఉన్న పట్టు, తండ్రి అనుచరుల మద్దతు కారణంగా ఆయన ఈ అత్యున్నత పీఠాన్ని అధిరోహించారు. గతంలో ఇరాన్ లో జరిగిన హిజాబ్ నిరసనల సమయంలో ప్రదర్శనకారులు మొజ్తబాను తీవ్రంగా విమర్శించిన సందర్భాలు ఉన్నాయి.