ఇజ్రాయెల్ వైమానిక దాడిలో అలీ లారిజానీ అంతం.. ధ్రువీకరించిన ఇరాన్
ఇరాన్ రాజకీయాల్లో దశాబ్దాల పాటు చక్రం తిప్పిన కీలక నేత, సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ చీఫ్ అలీ లారిజానీ ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో...
By - అంజి |
ఇజ్రాయెల్ వైమానిక దాడిలో అలీ లారిజానీ అంతం.. ధ్రువీకరించిన ఇరాన్
ఇరాన్ రాజకీయాల్లో దశాబ్దాల పాటు చక్రం తిప్పిన కీలక నేత, సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ చీఫ్ అలీ లారిజానీ ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో మరణించారు. ఈ విషయాన్ని ఇరాన్ ప్రభుత్వం మంగళవారం అధికారికంగా ధృవీకరించింది. లారిజానీతో పాటు ఆయన కుమారుడు, అంగరక్షకులు కూడా ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ కోసం జీవితాంతం సేవ చేసిన లారిజానీని ఆ దేశం ‘రక్తసాక్షి’గా అభివర్ణించింది.
ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ఈ దాడిని ధృవీకరిస్తూ, లారిజానీతో పాటు బాసిజ్ పారామిలటరీ దళ కమాండర్‌ను కూడా ‘హతమార్చామని’ ప్రకటించారు. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఖమేనీ మరణం తర్వాత పగ్గాలు చేపట్టిన ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీని కూడా వదిలిపెట్టబోమని, అతడిని వెతికి పట్టుకుని అంతం చేస్తామని ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ఎఫీ డెఫ్రిన్ హెచ్చరించారు. ఇరాన్ అగ్ర నాయకత్వాన్ని బలహీనపరచడం ద్వారా ఆ దేశ ప్రజలు ప్రస్తుత పాలనను తొలగించే అవకాశం కల్పించడమే తమ లక్ష్యమని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పేర్కొన్నారు.
అలీ లారిజానీ ఇరాన్ అధికార యంత్రాంగంలో అత్యంత కీలక వ్యక్తి. ఇరాన్ అగ్రశ్రేణి రాజకీయ కుటుంబానికి చెందిన లారిజానీ, 2008 నుండి 2020 వరకు పార్లమెంట్ స్పీకర్‌గా పనిచేశారు. ఇరాన్ అణు విధాన రూపకల్పనలో ఆయనది ప్రధాన పాత్ర. 2005-2007 మధ్య కాలంలో ప్రధాన అణు చర్చల ప్రతినిధిగా ఉంటూ, ఇరాన్ యురేనియం సుసంపన్నం చేసే హక్కును ఆయన బలంగా సమర్థించారు. అమెరికా ఆంక్షలు ఎదుర్కొన్నప్పటికీ, ఇరాన్ అంతర్గత భద్రత మరియు విదేశీ విధానాల్లో ఆయన మాటే వేదంగా ఉండేది.
1958లో ఇరాక్‌లోని నజాఫ్‌లో జన్మించిన లారిజానీ, ఇరాన్-ఇరాక్ యుద్ధ సమయంలో రివల్యూషనరీ గార్డ్స్‌లో చేరి తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. సాంస్కృతిక మంత్రిగా, ప్రభుత్వ ప్రసార విభాగం అధిపతిగా పనిచేస్తూ వ్యవస్థపై పట్టు సాధించారు. ఇటీవల ఇరాన్ అగ్ర నాయకత్వంపై ఇజ్రాయెల్ వరుస దాడులు చేస్తోన్న తరుణంలో, లారిజానీ మరణం ఇరాన్ పాలకులకు కోలుకోలేని దెబ్బగా భావిస్తున్నారు.