ఘోర అగ్నిప్రమాదం.. మంటల్లో చిక్కుకుని 32 మంది మృతి

ఇరాన్‌లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 32 మంది ప్రణాలు కోల్పోయారు.

By Srikanth Gundamalla  Published on  3 Nov 2023 11:19 AM GMT
iran, fire accident, 32 died,

ఘోర అగ్నిప్రమాదం.. మంటల్లో చిక్కుకుని 32 మంది మృతి

ఇరాన్‌లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఉత్తర ఇరాన్‌లోని ఓ పునరావాస కేంద్రంలో మంటలు చెలరేగాయి. దాంతో.. తీవ్ర విషాదం నెలకొంది. ఈ దుర్ఘటనలో 32 మంది ప్రణాలు కోల్పోయారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి చికిత్స చేయిస్తున్నారు.

ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు 200 కిలోమీటర్ల దూరంలో గిలాన్‌ ప్రావిన్స్‌లతోని లాంగార్డ్‌ అనే ప్రాంతం ఉంది. మాదక ద్రవ్యాలు తీసుకునే వారికి అక్కడ చికిత్స అందించేందుకు పునరావాసం ఏర్పాటు చేశారు అధికారులు. శుక్రవారం ఉదయం అందులోనే అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మత్తు మందులనుంచి బయటపడాలన్న మంచి ఆశయంతో మాదక ద్రవ్యాల పునరావాస కేంద్రంలో చేరిన బాధితులు అగ్నికి ఆహుతి అయ్యారు. ఈ ఘటన బాధిత కుటుంబాల్లో అంతులేని శోకాన్ని మిగిల్చింది. ఉన్నట్లుండి ఆ పునరావాస భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో.. అందులో చిక్కున్నవారు మంటల్లో చిక్కుకున్నారు. మంటల ధాటికి పైకప్పు పూర్తిగా ధ్వంసమైంది. దీంతో బాధితులు తప్పించుకునే మార్గం లేకుండా పోయినట్టు తెలుస్తోంది.

మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది. బయటకు వచ్చేందుకు వీలులేక దాదాపు 32 మంది అందులోనే సజీవ దహనం అయ్యారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇక అగ్నిప్రమాద సంఘటన గురించి సమాచారం అందుకున్న ఫైరింజన్‌ వెంటనే అక్కడికి చేరుకుంది. అయితే.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మంటలను పూర్తిగా అదుపు చేసినట్లు అధికారులు వెల్లడించారు. పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొని క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారని తెలిపారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ప్రమాదానికి స్పష్టమైన కారణాలు ఇంకా తెలియ రాలేదు.

ఈ ఘటనపై స్పందించిన ఉన్నతాధికారులు.. పునరావాస కేంద్రం మేనేజర్‌, సిబ్బందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందని ఆ ప్రావిన్స్‌ డిప్యూటీ గవర్నర్ వెల్లడించారు. కాగా.. ఇది ఈ ఏడాది ఇరాన్‌లో జరిగిన రెండో అతిపెద్ద అగ్నిప్రమాద సంఘటన. గత జనవరిలో టెహ్రాన్‌లో ప్లాస్కో అనే 15 అంతస్తుల షాపింగ్‌ మాల్‌లో మంటలు చెలరేగి 22 మంది ప్రాణాలు కోల్పోయారు.

Next Story