ఘోస్ట్ టౌన్‌: ఇప్పుడిది పెద్ద టూరిస్ట్ అట్రాక్షన్

Interesting facts about the Spanish Ghost Village. నీటిలో మునిగి తేలిన ఈ అసెరోడో గ్రామాన్ని సందర్శిస్తున్న పర్యాటకులు దాన్ని ఘోస్ట్ టౌన్‌గా పిలుస్తున్నారు.

By అంజి  Published on  28 Aug 2022 9:44 AM IST
ఘోస్ట్ టౌన్‌: ఇప్పుడిది పెద్ద టూరిస్ట్ అట్రాక్షన్

సరిగ్గా 30 ఏళ్ల కిందట ఓ రిజర్వాయర్ కట్టాలనుకున్నారు. అయితే పక్కనే ఉన్న గ్రామం అడ్డు వచ్చింది. వెంటనే గ్రామస్థులందరిని ఒప్పించి, వారిని వేరే చోటకు తరలించి రిజర్వాయర్ కట్టేశారు. ఆ తర్వాత డ్యామ్‌లోకి భారీగా వరద నీరు చేరడంతో ఆ గ్రామం మునిగిపోయింది. అలా 30 ఏళ్ల క్రితం నీటి అడుగుకు చేరిన ఆ గ్రామం.. ఇటీవల కరువు ఏర్పడి బయటపడింది. ప్రస్తుతం ఈ గ్రామాన్ని చూసేందుకు టూరిస్టులు బారులు తీరుతున్నారు. ఆ గ్రామం పేరు అసెరోడో. ఇదంతా స్పెయిన్‌లో జరిగింది.

మొండి గోడలు, విరిగిన ఇళ్లతో నీళ్లలోంచి బయటపడిన ఈ గ్రామం ఇప్పుడు పెద్ద టూరిస్ట్ అట్రాక్షన్‌గా మారింది. పిల్లలుగా ఉన్నప్పుడు ఆ ఊరిని వదిలి వెళ్లిన వాళ్లు ఇప్పుడు పెద్దవాళ్లు అయిపోయారు. చిన్నప్పుడు తిరగాడిన ఆ ఊరిని చూసేందుకు వారంతా వచ్చి వెళ్తున్నారు. 1992లో స్పానిష్ - పోర్చుగీస్ సరిహద్దు ప్రాంతంలో ఈ రిజర్వాయర్‌ను కట్టారు. ఇటీవల కొన్ని నెలల నుంచి ఆ ప్రాంతంలో వర్షాలు పడలేదు. దీంతో డ్యామ్‌లోని నీరు ఎండిపోసాగింది. ఈ క్రమంలోనే డ్యామ్‌లో ఆ ఊరి శిథిలాలు బయటపడ్డాయి.

ప్రస్తుతం రిజర్వాయర్‌లో 15 శాతం నీరు మాత్రమే ఉంది. నీటిలో మునిగి తేలిన ఈ అసెరోడో గ్రామాన్ని సందర్శిస్తున్న పర్యాటకులు దాన్ని ఘోస్ట్ టౌన్‌గా పిలుస్తున్నారు. ధ్వంసమైన కారు, రాతి గోడలు, తుప్పు పట్టిన ఇనుప ఊచలు ఉన్నాయి. 'రిజర్వాయర్ కట్టకు ముందు ఈ ప్రదేశం అంతా ద్రాక్ష తోటలు, నారింజ తోటలతో నిండి ఉండేది' అని 1992 వరకు అక్కడ జీవించిన వ్యక్తి చెప్పారు.

Next Story