జైలులో ఘోర అగ్నిప్ర‌మాదం.. 41 మంది ఖైదీలు మృతి

Indonesia Prison Fire 41 Drug Inmates dead.జైలులో ఘోర అగ్నిప్ర‌మాదం చోటు చేసుకుంది. ఈ ప్ర‌మాదంలో జైలులోని 41

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 Sep 2021 3:39 AM GMT
జైలులో ఘోర అగ్నిప్ర‌మాదం.. 41 మంది ఖైదీలు మృతి

జైలులో ఘోర అగ్నిప్ర‌మాదం చోటు చేసుకుంది. ఈ ప్ర‌మాదంలో జైలులోని 41 మంది ఖైదీలు మృత్యువాత ప‌డ‌గా.. 39 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న ఇండోనేసియా దేశంలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే.. ఇండోనేషియా రాజ‌ధాని జ‌కార్తాలోని టాంగెరాంగ్ జైలులో బుధ‌వారం ఉద‌యం అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. తెల్ల‌వారుజామున 1 గంట స‌మ‌యంలో పెద్ద ఎత్తున మంట‌లు చెల‌రేగాయి. గ‌మ‌నించిన అధికారులు అగ్నిమాప‌క సిబ్బందికి స‌మాచారం అందించారు.

స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది వెంట‌నే అక్క‌డ‌కు చేరుకుని మంట‌ల‌ను అదుపు చేసేందుకు య‌త్నిస్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు 41 మంది ఖైదీలు మృతి చెందారు. మ‌రో 39 మంది ఖైదీలు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వారిని స‌మీపంలోని ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొంద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంది. కాగా.. అగ్నిప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంది.

కాగా.. ఈ ఘ‌ట‌న‌పై ఇండోనేషియా న్యాయ, మానవహక్కుల మంత్రిత్వశాఖ ఆధీనంలోని జైళ్ల శాఖ అధికార ప్రతినిధి రికా అప్రియంతి స్పందించారు. ఇప్ప‌టి వ‌ర‌కు అందిన స‌మాచారం ప్రకారం 41 మంది ఖైదీలు మ‌ర‌ణించార‌ని, మ‌రో 39 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డార‌ని తెలిపారు. సహాయసిబ్బంది ఖైదీలను సురక్షితంగా తరలించేందుకు ముమ్మ‌రంగా ప్ర‌య‌త్నిస్తున్నార‌న్నారు. అగ్నిప్ర‌మాదానికి కార‌ణాలు ఇంకా తెలియ‌రాలేద‌న్నారు. స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయ‌న్నారు. మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంద‌న్నారు.

టాంగెరాంగ్ జైలును 1225 మంది ఖైదీలు ఉండడానికి వీలుగా నిర్మించినా, దీంట్లో ప్రస్తుతం 2 వేల మందికి పైగా ఖైదీలు ఉన్నారు. అగ్నిప్రమాదం జరిగిన సి బ్లాక్ లో ప్రమాదం జరిగిన సమయంలో 122 మంది ఖైదీలు ఉన్నారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

Next Story