అమెరికాలో భారతీయ విద్యార్థినిపై పిడుగు.. 20 నిమిషాలు గుండె ఆగడంతో..

హయ్యర్‌ స్టడీస్‌ కోసం అమెరికా వెళ్లిన ఓ భారతీయ విద్యార్థిని.. అక్కడ పిడుగు పాటుకు గురైంది.

By అంజి  Published on  21 July 2023 9:23 AM IST
Indian student,  brain damage , lightning, USA

అమెరికాలో భారతీయ విద్యార్థినిపై పిడుగు

హయ్యర్‌ స్టడీస్‌ కోసం అమెరికా వెళ్లిన ఓ భారతీయ విద్యార్థిని.. అక్కడ పిడుగు పాటుకు గురైంది. ప్రస్తుతం ఆ విద్యార్థిని మృత్యువుతో పోరాడుతోందని అధికారులు తెలిపారు. యూనివర్సిటీ ఆఫ్‌ హ్యూస్టన్‌లో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో మాస్టర్‌ చేస్తున్న్ కోడూరు సుశ్రూణ్య (25).. జూలై ఫస్ట్‌ వీక్‌లో తన స్నేహితులతో కలిసి స్థానిక పార్కు శాన్ జాసింటో మాన్యుమెంట్‌లోని రిఫ్లెక్షన్ పాండ్ వెంబడి నడుచుకుంటూ వెళ్తుండగా పిడుగుపాటుకు గురైంది. దీంతో కొలనులో పడిపోయింది. ఈ క్రమంలోనే సుమారు 20 నిమిషాల పాటు ఆమె గుండె లయ తప్పింది. సుశ్రూణ్య మెదడు దెబ్బతిని కోమాలోకి వెళ్లిందని ఆస్పత్రి వర్గాలు తెలిపారు. ఆమె స్వతహాగా ఊపిరి పీల్చుకోలేకపోతోంది.

ఆమెకు సుధీర్ఘ కాలం పాటు కీలకమైన వైద్య చికిత్స అందించాల్సి ఉంటుందని సూశ్రూణ్య బంధువు సురేంద్రకుమార్‌ కొత్త తెలిపారు. విద్యార్థిని వైద్య ఖర్చుల కోసం క్రౌడ్ ఫండింగ్ వేదిక 'గోఫండ్‌మీ' ద్వారా ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. చికిత్స తర్వాత ఆమె త్వరలో తన సాధారణ దినచర్యకు తిరిగి రావచ్చు. కోడూరు కుటుంబం భారతదేశంలో ఉన్న ఆమె తల్లిదండ్రులను హ్యూస్టన్‌కు తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. తద్వారా వారు తమ కుమార్తెకు అండగా ఉంటారు. ఆమె త్వరగా కోలుకోవడానికి సహాయపడవచ్చు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మాస్టర్స్ ప్రోగ్రామ్ దాదాపు పూర్తి చేసిన సుశ్రూణ్య.. ఇంటర్న్‌షిప్ కోసం ఎదురుచూస్తోన్న సమయంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.

Next Story