అందుకు కట్టుబడి ఉన్నాం..చైనా అధ్యక్షుడితో సమావేశంలో మోదీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఆదివారం టియాంజిన్‌లో సమావేశమయ్యారు.
By Knakam Karthik
అందుకు కట్టుబడి ఉన్నాం..చైనా అధ్యక్షుడితో సమావేశంలో మోదీ
టియాంజిన్: భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఆదివారం టియాంజిన్‌లో సమావేశమయ్యారు. భారత-చైనా సంబంధాలను “పరస్పర నమ్మకం, గౌరవం, సున్నితత్వం” ఆధారంగా ముందుకు తీసుకెళ్లడానికి తాను కట్టుబడి ఉన్నానని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
SCO (షాంఘై సహకార సంస్థ) రెండు రోజుల సదస్సు సైడ్‌లైన్స్‌లో జరిగిన ఈ సమావేశంలో, గల్వాన్ తర్వాత సరిహద్దు ప్రాంతంలో డిస్‌ఎంగేజ్‌మెంట్ కారణంగా శాంతి, స్థిరత్వం ఏర్పడిందని ఆయన గుర్తుచేశారు. గత ఏడాది రష్యాలోని కజాన్‌లో జరిగిన చర్చలు ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త దిశ చూపాయని మోదీ అన్నారు.
అలాగే, కైలాస్ మానసరోవర్ యాత్ర పునఃప్రారంభం, రెండు దేశాల మధ్య డైరెక్ట్ విమాన సర్వీసులు మళ్లీ మొదలుపెట్టడం వంటి అంశాలను కూడా ప్రస్తావించారు. “భారత్–చైనా సహకారం 2.8 బిలియన్ జనాభా ప్రయోజనాలకు తోడ్పడుతుంది. ఇది మొత్తం మానవజాతి మేలకు మార్గం సుగమం చేస్తుంది” అని మోదీ అన్నారు.
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, మోదీని స్వాగతిస్తూ మాట్లాడుతూ – “చైనా, భారత్ మానవ నాగరికతలో అత్యంత పురాతన దేశాలు. గ్లోబల్ సౌత్‌లో భాగమైన ఈ రెండు మహా దేశాలు – డ్రాగన్ మరియు ఎలిఫెంట్ కలసి ముందుకు సాగడం అత్యంత కీలకం” అని అన్నారు.
ఏడు సంవత్సరాల తర్వాత ప్రధాని మోదీ చైనా పర్యటన చేపట్టడం విశేషం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్‌ల కారణంగా భారత్-అమెరికా సంబంధాలు ఉద్రిక్తత ఎదుర్కొంటున్న వేళ ఈ సమావేశం ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది.
టియాంజిన్ చేరుకున్న మోదీకి భారతీయ సమాజం ఘన స్వాగతం పలికింది. “భారత్ మాతాకి జై”, “వందే మాతరం” నినాదాలతో ఆతిథ్యం అందించారు. అనంతరం చైనీస్ కళాకారులు సితార్, సంతోర్, తబలా వాద్యాలతో భారతీయ శాస్త్రీయ సంగీత ప్రదర్శన చేసి ఆత్మీయతను చాటారు.