తాలిబన్ల కాల్పుల్లో భారతీయ జర్నలిస్ట్ మృతి

Indian photojournalist Danish Siddiqui killed in Afghanistan clashes.అప్గానిస్థాన్‌లో అమెరికా సైన్యం ఉప‌సంహ‌ర‌ణ‌తో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 July 2021 8:52 AM IST
తాలిబన్ల కాల్పుల్లో భారతీయ జర్నలిస్ట్ మృతి

అప్గానిస్థాన్‌లో అమెరికా సైన్యం ఉప‌సంహ‌ర‌ణ‌తో తాలిబ‌న్లు మ‌ళ్లీ రెచ్చిపోతున్నారు. తాలిబ‌న్లు, ప్ర‌భుత్వ ద‌ళాల‌ల‌కు మ‌ధ్య పోరు జ‌రుగుతోంది. ఇప్ప‌టికే దేశంలోని దాదాపు 80శాతానికి పైగా గ్రామాలు, స‌రిహ‌ద్దుల‌ను తాలిబ‌న్లు త‌మ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. అస‌లు అక్క‌డ ఏం జ‌రుగుతుంద‌నేది చిత్రీక‌రించేందుకు వెళ్లిన ప్ర‌ముఖ భార‌తీయ జ‌ర్న‌లిస్టు, పులిట్జ‌ర్ అవార్డు గ్ర‌హీత డానీష్ సిద్దిఖీ క‌న్నుమూశారు. ప్ర‌ముఖ న్యూస్ ఏజెన్సీ రాయ్‌ట‌ర్స్‌కు ప‌ని చేస్తున్న ముంబైకి చెందిన 40 ఏళ్ల డానిష్ సిద్ధిఖీ.. కొద్ది రోజులగా ఆఫ్ఘానిస్తాన్ స్పెష‌ల్ ఫోర్సెస్ వెంట ఉంటూ అక్క‌డి ప‌రిస్థితిపై రిపోర్ట్ చేస్తున్నారు. గురువారం రాత్రి కందహార్ ఫ్రావిన్స్ లోని స్పిన్ బోల్డాక్ లోని ప్ర‌ధాన మార్కెట్ ప్రాంతాన్ని ఆఫ్ఘాన్ ప్ర‌త్యేక ద‌ళాలు త‌మ ఆధీనంలోకి తీసుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్న స‌మ‌యంలో తాలిబ‌న్లు ఫైరింగ్ జ‌రిపారు. పాక్ స‌రిహ‌ద్దుకు చేరువ‌లోని ఈ ప్రాంతాన్ని ఇటీవ‌ల తాలిబ‌న్లు ఆక్ర‌మించుకుంటున్నారు. అక్క‌డ జ‌రిగిన కాల్పుల్లో సిద్దీఖి స‌హా అఫ్గాన్ సైన్యంలోని సీనియ‌ర్ అధికారి ఒక‌రు మృతిచెందారు.

సిద్దిఖీ మృతిపై భారత్‌లో అఫ్గానిస్థాన్ అంబాసిడర్ ఫరిద్ మముంజే సంతాపం వ్యక్తం చేశారు. సిద్దిఖీ మృతి తనను తీవ్రంగా కలచివేసిందని ఫరిద్ ట్వీట్ చేశారు. సిద్దిఖీ టెలివిజన్ న్యూస్ కరస్పాండెంట్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత ఫొటో జర్నలిజం వైపు అడుగులు వేశారు. 2017 నుంచి ప్రముఖ అంతర్జాతీయ న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్‌లో ఆయన పని చేస్తున్నారు. సిద్దిఖీ మృతిని రాయిటర్స్ ధ్రువీకరించింది. తమ ఫొటో జర్నలిస్ట్ సిద్దిఖీ అఫ్గానిస్తాన్‌లో చనిపోవడం తీవ్ర వేదనకు గురిచేసిందని రాయిటర్స్ ప్రెసిడెంట్ మైఖేల్ ఫ్రీడెన్‌బరో, ఎడిటర్ ఇన్ చీఫ్ అలెస్సాండ్రా గలోనీ ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, రాయిటర్స్ టీమ్‌లో పని చేస్తున్న సమయంలో 2018లో రోయింగ్యా రెఫ్యూజీ క్రైసిస్‌పై ఓ డాక్యుమెంటరీ తీశారు. దీనికి గానూ ఫీచర్ ఫొటోగ్రఫీ విభాగంలో సహచరుడు అడ్నాన్ అబిదీతో కలసి సిద్దిఖీ పులిట్జర్ అవార్డు దక్కించుకున్నారు.

కాగా. సిద్దిఖీ మృత‌దేహాన్ని తాలిబ‌న్లు రెడ్‌క్రాస్ సంస్థ‌కు అప్ప‌గించారు. దీంతో భార‌త్ త‌ర‌లించ‌డానికి విదేవీ వ్య‌వ‌హారాల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. కాబూల్‌లోని భార‌త రాయ‌బారి అక్క‌డి అధికారుల‌తో ఎప్ప‌టిక‌ప్పుడు సంప్ర‌దిస్తున్నారని, స‌మాచారాన్ని సిద్దిఖీ కుటుంబ స‌భ్యుల‌కు కూడా అంద‌జేస్తున్నామ‌ని అధికార ప్ర‌తినిధి అరింద‌మ్ బాగ్చీ తెలిపారు.

Next Story