పన్నూన్ హత్యకు కుట్ర కేసు: అమెరికా కోర్టులో నిఖిల్ గుప్తా నేరాంగీకారం

అమెరికా గడ్డపై ఖలిస్తానీ వేర్పాటువాది గుర్పత్వంత్ సింగ్ పన్నూన్‌ను హత్య చేసేందుకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న...

By -  అంజి
Published on : 14 Feb 2026 8:42 AM IST

Nikhil Gupta Guilty Plead, Gurpatwant Singh Pannun Murder Plot, Khalistani Terrorist, US Manhattan Court, India-US Relations, Vikash Yadav, Transnational Repression

పన్నూన్ హత్యకు కుట్ర కేసు: అమెరికా కోర్టులో నిఖిల్ గుప్తా నేరాంగీకారం

అమెరికా గడ్డపై ఖలిస్తానీ వేర్పాటువాది గుర్పత్వంత్ సింగ్ పన్నూన్‌ను హత్య చేసేందుకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భారతీయ పౌరుడు నిఖిల్ గుప్తా (54) తన నేరాన్ని అంగీకరించారు. శుక్రవారం మన్‌హట్టన్ ఫెడరల్ కోర్టులో జరిగిన విచారణలో ఆయన తనపై ఉన్న మూడు ప్రధాన నేరారోపణలను (హత్యకు కుట్ర, మనీలాండరింగ్ వంటివి) ఒప్పుకున్నారు. 2023 మే నెలలో వికాస్ యాదవ్ అనే భారత ప్రభుత్వ ఉద్యోగి ఆదేశాల మేరకు నిఖిల్ గుప్తా ఈ హత్యకు పథకం వేశారని అమెరికా దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి. పన్నూన్ హత్య కోసం ఒక వ్యక్తికి 1,00,000 డాలర్లు (సుమారు రూ. 83 లక్షలు) ఇచ్చేందుకు నిఖిల్‌ గుప్తా అంగీకరించారు.

అయితే, గుప్తా సంప్రదించిన వ్యక్తి అమెరికా డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్ (DEA) ఇన్ఫార్మర్ కావడంతో ఈ కుట్ర బయటపడింది. జూన్ 2023లో అడ్వాన్స్ కింద 15,000 డాలర్లను నగదు రూపంలో అందించినట్లు ఆధారాలు లభించాయి. ఈ నేరాలకు గరిష్టంగా 40 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. మే 29న కోర్టు తుది తీర్పు వెలువరించనుంది. భారత ప్రభుత్వం ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. ఇలాంటి చర్యలు ప్రభుత్వ విధానానికి విరుద్ధమని స్పష్టం చేసింది. అయితే, అమెరికా ఫిర్యాదు మేరకు 2023 నవంబర్‌లో ఒక ఉన్నత స్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ జనవరి 2025లో తన నివేదికను సమర్పించి, సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలకు సిఫార్సు చేసింది.

ఎవరు ఈ గుర్పత్వంత్ సింగ్ పన్నూన్?

పన్నూన్ నిషేధిత సంస్థ 'సిఖ్ ఫర్ జస్టిస్' (SFJ) అధినేత. వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్నందుకు 2020లో భారత ప్రభుత్వం ఇతడిని ఉగ్రవాదిగా ప్రకటించింది. పంజాబ్‌లోని ఇతని ఆస్తులను ఎన్‌ఐఏ (NIA) ఇప్పటికే జప్తు చేసింది. భారత్‌కు వ్యతిరేకంగా రెచ్చగొట్టే వీడియోలు విడుదల చేయడం, విమానాలపై దాడుల హెచ్చరికలు ఇవ్వడం వంటి చర్యలకు పన్నూన్ పాల్పడుతుంటాడు.

Next Story