ఇటీవలి వైమానిక దాడులు, కమ్యూనికేషన్ పరికరాలలో పేలుళ్ల సంఘటన తర్వాత తదుపరి నోటీసు వచ్చేవరకు లెబనాన్‌కు ప్రయాణించవద్దని బీరూట్‌లోని భారత రాయబార కార్యాలయం భారతీయ పౌరులను గట్టిగా కోరింది. లెబనాన్‌లో నివసిస్తున్న భారతీయ పౌరులు వీలైనంత త్వరగా దేశం విడిచి వెళ్లాలని భారత రాయబార కార్యాలయ అధికారులు సలహా ఇచ్చారు. భారత ప్రజలు "తీవ్ర జాగ్రత్తలు" పాటించాలని, ఎంబసీతో సంబంధాలు కొనసాగించాలని సూచించారు.
హెజ్బొల్లా మిలిటెంట్లను అంతం చేయడమే లక్ష్‌యంగా లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరుపుతున్న భీకర దాడుల్లో తీవ్ర ప్రాణ నష్టం వాటిల్లుతోంది. బుధవారం జరిపిన క్షిపణి దాడుల్లో 51 మంది చనిపోయారు. ఇప్పటి వరకు వందలాది మంది ప్రాణాలు కోల్పోయారని, 90 వేల మందికిపైగా సామాన్యులు నిరాశ్రయులు అయినట్టు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ఇటు హెజ్బొల్లా సైతం ప్రతి దాడులకు దిగుతోంది. దీంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం కనిపిస్తోంది.
ఇదిలా ఉంటే.. ఇజ్రాయెల్ - హెజ్బొల్లా మధ్య తాత్కాలిక కాల్పుల విరమణకు అమెరికా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటు నార్త్ ఇజ్రాయెల్, అటు సౌత్ లెబనాన్‌లో వేలాది మంది నిరాశ్రయులు కావడంతో యూఎస్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ విషయంపై న్యూయార్క్‌లో జరిగిన యూఎన్‌వో సర్వప్రతినిధణి సమావేశాల్లో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ ప్రపంచ దేశాధినేతలతో చర్చించారు. త్వరలోనే ఈ కాల్పుల విరమణకు తెర పడుతుందని తెలుస్తోంది.