నౌక‌లో అగ్నిప్రమాదం.. అదుపులోకి వ‌చ్చిన మంట‌లు

Indian coast guard rushes help to douse fire on container ship.నౌక‌లో వ్యాపిస్తున్న మంట‌ల్ని అదుపులోకి తెచ్చిన‌ట్లు అధికారులు తెలిపారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 May 2021 9:33 AM GMT
container ship

భార‌త్‌లోని గుజ‌రాత్ తీరం నుంచి శ్రీలంక‌లోని కొలంబో ఎయిర్ పోర్టుకు వెలుతున్న స‌రుకు ర‌వాణా నౌక ఎంవీ ఎక్స్‌ప్రెస్‌లో మంగ‌ళ‌వారం భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించిన సంగ‌తి తెలిసిందే. కొలంబో పోర్టుకు స‌మీపంలో జ‌రిగిన ఈ ప్ర‌మాదంలో ఓ కంటైన‌ర్‌కు మంట‌లు అంటుకుని పెద్ద ఎత్తున చెల‌రేగాయి. అయితే ఆ మంట‌ల్ని ఆర్పేందుకు శ్రీలంక‌, ఇండియా సంయుక్త ఆప‌రేష‌న్ చేపట్టాయి. ఎట్ట‌కేల‌కు ఆ నౌక‌లో వ్యాపిస్తున్న మంట‌ల్ని అదుపులోకి తెచ్చిన‌ట్లు అధికారులు తెలిపారు. ప్ర‌మాద స‌మ‌యంలో నౌక‌లో ఉన్న వివిధ దేశాల‌కు 25 మంది సిబ్బందిని ఇప్ప‌టికే సుర‌క్షితంగా కాపాడారు.

మంట‌లు త‌గ్గ‌డంతో.. నౌక ఇప్పుడు కాస్త క‌నిపిస్తున్న‌ది. ఆ కంటైన‌ర్ షిప్‌లో సింగ‌పూర్‌కు కెమిక‌ల్స్ తీసుకువెళ్తున్న‌ట్లు తెలుస్తోంది. దాంట్లో 1486 కంటైన‌ర్లు, 25 ట‌న్నుల నైట్రిక్ యాసిడ్‌తో పాటు ఇత‌ర ర‌సాయ‌నాలు ఉన్నాయి. నౌకలోని సరుకును సురక్షితంగా తెచ్చేందుకు ప్రయత్నాలు చేప‌ట్టారు. ఇప్పటికే రెండు ఐసీజీ ఓడలు 'వైభవ్', 'వజ్రా'లను సహాయం కోసం పంపినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. శ్రీలంక అధికారులతో జరిపిన చర్చల అనంతరం ఎలాంటి ప్రమాదాలనైనా తట్టుకునే వైభవ్‌, వజ్రల పంపించినట్లు కోస్ట్‌గార్డ్‌ అధికారులు పేర్కొన్నారు.

వీటికి అదనంగా, కొచ్చి, చెన్నై, టుటికోరిన్ వద్ద ఇండియన్ కోస్ట్ గార్డ్ నౌకలను తక్షణ సహాయం కోసం రెడీగా ఉంచారు. నౌక‌లో ఉన్న కంటైన‌ర్ల నుంచి ఇంధ‌నం లీక‌వుతున్న‌ది. దీంతో స‌మీప బీచ్‌ల వ‌ద్ద ఆయిల్ పేరుకుంటున్న‌ది. తీర ప్రాంత ప్ర‌జ‌లు నౌక నుంచి కొట్టుకువ‌చ్చిన వాటిని ముట్టుకోవ‌ద్దు అని అధికారులు హెచ్చ‌రిక‌లు జారీ చేశారు.

Next Story