Canada: స్విమ్మింగ్ పూల్‌లో మహిళల పట్ల అసభ్య ప్రవర్తన, భారతీయుడి అరెస్ట్

మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. ఒంటరిగా కనిపిస్తే చాలు కొందరు కామాంధులు లైంగిక దాడులకు పాల్పడుతున్నారు.

By Srikanth Gundamalla  Published on  12 July 2024 10:30 AM IST
Indian, arrest,  Canada, abuse, woman,  swimming pool,

Canada: స్విమ్మింగ్ పూల్‌లో మహిళల పట్ల అసభ్య ప్రవర్తన, భారతీయుడి అరెస్ట్

మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. ఒంటరిగా కనిపిస్తే చాలు కొందరు కామాంధులు లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. ఇంకొన్ని సందర్భాల్లో రద్దీ ప్రదేశాల్లో మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తుంటారు. తాజాగా కెనడాలో భారత్‌కు చెందిన ఓ వ్యక్తి స్విమ్మింగ్‌ పూల్‌లో ఉన్న మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. దాంతో.. పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. జూలై 7వ తేదీనే ఈ సంఘటన జరిగినా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

జూలై 7న కెనడాలోని పబ్లిక్ వాటర్ పార్క్ వద్ద మహిళలను పట్టుకున్నందుకు భారతీయ సంతతికి చెందిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. మోంక్టన్‌లోని మౌంటెన్ రోడ్‌లోని పబ్లిక్ వాటర్ పార్క్ వద్ద భారత్‌కు చెందిన ఓ 25 ఏళ్ల యువకుడు వచ్చాడు. ఆ తర్వాత అక్కడున్న మహిళల వద్దకు వెళ్తూ ఒకరి తర్వాత మరొకరిని తడుతముతూ వెళ్లాడు. బాధితులు కనీసం పన్నెండు మంది ఉన్నారనీ.. వీరిలో కొందరు 16 ఏళ్లలోపు ఆడవారు ఉన్నారని పోలీసుల తెలిపారు.

ఇక బాదితుల కంప్లైంట్‌తో వెంటనే స్పందించిన పోలీసులు.. స్విమ్మింగ్‌ పూల్‌ వద్దే సదురు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత నిందితుడు కస్టడీ నుంచి విడుదల అయ్యాడని తెలిపారు. నిందితుడిని అక్టోబర్ 24న మోంక్టన్ ప్రావిన్షియల్ కోర్టులో హాజరు కావాల్సి ఉందని పోలీసులు చెప్పారు. ఈ కేసులో దర్యాప్తు చేస్తున్నామని.. ఇంకా బాధితులు ఉంటే ముందుకు వచ్చి కంప్లైంట్‌ ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు.

ఈ మేరకు ప్రకటన విడుదల చేసిన పోలీసులు.. 'జూలై 7న పిల్లలు ఈ ప్రదేశానికి హాజరైనట్లయితే వారితో మాట్లాడవలసిందిగా మేము తల్లిదండ్రులను కోరుతున్నాము. లైంగిక వేధింపుల ఫిర్యాదు ఎప్పుడైనా చేయవచ్చని కోరుతున్నాం. మీరు లైంగిక దుష్ప్రవర్తనకు గురైనట్లయితే, దయచేసి మమ్మల్ని సంప్రదించండి" అని పోలీసులు పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.

Next Story