అమెరికాలో విషాదం చోటు చేసుకుంది. భారత సంతతికి చెందిన ఓ యువకుడు శాన్ ఫ్రాన్సిస్కోలోని ప్రసిద్ధ గోల్డెన్ గేట్ వంతెనపై నుండి దూకి ఆత్మ హత్యకు పాల్పడ్డాడు.
పన్నెండవ తరగతి చదువుతున్న 16 ఏళ్ల బాలుడు బుధవారం సాయంత్రం 4.58 గంటల సమయంలో గోల్డెన్ గేట్ వంతెనపై నుంచి కిందకు దూకాడు. అతడి సైకిల్, ఫోన్, బ్యాగు వంతెనపై లభ్యమయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు అక్కడకు చేరుకుని బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా.. అతడి బతికి ఉండే అవకాశాలు లేవని US కోస్టల్ గార్డ్స్ అధికారులు తెలిపారు.
కమ్యూనిటీ నాయకుడు అజయ్ జైన్ భూటోరియా మాట్లాడుతూ.. గోల్డెన్ బ్రిడ్జిపై నుండి దూకి భాతర సంతతికి చెందిన వారు ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం ఇది నాలుగోసారి అని అన్నారు.
1937లో గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ ను ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 2 వేల మందికి పైగా దీని పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. గతేడాది కూడా 25 మంది బలవన్మరణానికి పాల్పడ్డారు. దీంతో ఇక్కడ ఆత్మహత్యలకు ముగింపు పలికే దిశగా చర్యలు చేపట్టారు. 1.7 మైళ్ల వంతెనకు ఇరువైపులా 20 అడుగుల వెడల్పుతో ఇనుప మెష్‌ను రూపొందిస్తున్నారు. 2018 నుంచి దీని పనులు ప్రారంభం అయ్యాయి. వాస్తవానికి ఇది ఈ ఏడాది జనవరి నాటికి పూర్తి చేయాల్సి ఉంది. ఇంకా పనులు కొనసాగుతున్నాయి.