భారత సంతతి వైద్యుడికి అమెరికాలో గొప్ప పదవి..!
Indian-American physician Vivek Murthy appointed as US Surgeon General. మరో భారతీయ అమెరికన్ ను అమెరికాలో గొప్ప పదవి లభించింది.
By Medi Samrat Published on 24 March 2021 2:24 PM ISTమరో భారతీయ అమెరికన్ ను అమెరికాలో గొప్ప పదవి లభించింది. భారతీయ అమెరికన్ డాక్టర్ వివేక్ మూర్తిని సర్జన్ జనరల్‌గా అమెరికా సెనేట్ మంగళవారం ధృవీకరించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వివేక్ మూర్తిని సర్జన్ జనరల్‌గా నామినేట్ చేశారు. మంగళవారం ఆయన నామినేషన్‌ను ధృవీకరించేందుకు సెనేట్‌లో ఓటింగ్ నిర్వహించారు. దాంతో 57 మంది సెనేటర్లు వివేక్ మూర్తికి అనుకూలంగా ఓటు వేయగా, 43 మంది సెనేటర్లు వ్యతిరేకించారు.
ఫిజీషియన్ డాక్టర్ వివేక్ మూర్తిని సర్జన్ జనరల్ గా నియమిస్తూ యూఎస్ సెనేట్ ఉత్తర్వులు జారీ చేసింది. రిపబ్లికన్ సెనేటర్లు బిల్ కాసిడీ, సుసాన్ కొలిన్స్, రోజర్ మార్షల్, లిసా ముర్కోవిస్కి, రాబ్ పోర్ట్మన్, మిట్ రోమ్నీ, డాన్ సుల్లివన్ వంటి వారు వివేక్‌కు అండగా నిలిచారు. బరాక్ ఒబామా హయాంలో కూడా వివేక్ మూర్తి సర్జన్ జనరల్‌గా పనిచేశారు. అయితే, 2017లో ట్రంప్ ఆయనను తొలగించారు.
కరోనా మహమ్మారి నియంత్రణపైనా వివేక్ మూర్తి కీలక నిర్ణయాలు తీసుకుంటారని ఉన్నతాధికారులు వెల్లడించారు. వివేక్ మూర్తి బరాక్ ఒబామా అధ్యక్ష బాధ్యతలు నిర్వహించిన సమయంలోనూ కీలక పదవిలో ఉన్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తి తరువాత మూర్తి కుటుంబంలోని కొందరు మరణించారు. తన నియామకం సందర్భంగా మూర్తి సెనేట్ లో మాట్లాడుతూ, ఈ మహమ్మారి నుంచి తప్పించుకునేందుకు అమెరికన్లకు సహకరించాలని ఉందని.. సాధారణ ప్రజలకు ఎప్పటికప్పుడు శాస్త్ర ఆధారిత మార్గాన్ని సూచిస్తూ, ముందుకు సాగుతానని అన్నారు. ఈ పదవి దక్కినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కఠిన పరిస్థితుల్లో ప్రజలంతా తమవంతు జాగ్రత్తలు తీసుకుంటూనే ఉండాలని సూచించారు.
వివేక్ మూర్తి మూలాలు భారత్ లోనే ఉన్నాయి. చిన్న వయసులోనే తల్లిదండ్రులతో కలసి ఆయన అమెరికాకు వెళ్లిపోయారు. కర్ణాటక రాష్ట్రంలో మూలాలు ఉన్నాయి. మియామీ ప్రాంతంలో తన తండ్రి నిర్వహించే క్లినిక్ లో వారాంతాలు సహాయం చేస్తూ ఉండేవారు. వివేక్ మూర్తి 'డాక్టర్స్ ఫర్ అమెరికా' కో-ఫౌండర్ గా కూడా ఉన్నారు. అమెరికన్లకు మంచి వైద్యం అందించాలన్నదే ఆయన తపన.