భారత్ - పాకిస్తాన్ మధ్య అణు యుద్ధ ముప్పు.. అమెరికా సంచలన రిపోర్ట్
అమెరికా సెనేట్‌కు సమర్పించిన 2026 వార్షిక ముప్పు అంచనా నివేదిక ప్రకారం.. భారత్ - పాకిస్తాన్ మధ్య అణు సంఘర్షణ జరిగే ప్రమాదం ఇంకా పొంచి ఉందని...
By - అంజి |
భారత్ - పాకిస్తాన్ మధ్య అణు యుద్ధ ముప్పు.. అమెరికా సంచలన రిపోర్ట్
అమెరికా సెనేట్‌కు సమర్పించిన 2026 వార్షిక ముప్పు అంచనా నివేదిక ప్రకారం.. భారత్ - పాకిస్తాన్ మధ్య అణు సంఘర్షణ జరిగే ప్రమాదం ఇంకా పొంచి ఉందని వెల్లడైంది. గతేడాది జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాం సమీపంలో జరిగిన ఉగ్రదాడిని ఉదహరిస్తూ, ఇరు దేశాల మధ్య శాంతిని దెబ్బతీసేందుకు ఉగ్రవాద శక్తులు 'ప్రేరకాలుగా' పనిచేస్తున్నాయని నివేదిక పేర్కొంది. రెండు దేశాలు నేరుగా యుద్ధాన్ని కోరుకోకపోయినప్పటికీ, ఉగ్రవాద దాడుల వంటి అనూహ్య పరిణామాలు ఉద్రిక్తతలను పెంచి, అది అణు యుద్ధానికి దారితీసే అవకాశం ఉందని అమెరికా నిఘా వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి.
పాకిస్తాన్ మిస్సైల్ టెక్నాలజీ, అమెరికాకు హెచ్చరిక
పాకిస్తాన్ తన క్షిపణి సాంకేతికతను రోజురోజుకూ అత్యాధునికం చేస్తోందని నివేదిక పేర్కొంది. కేవలం దక్షిణాసియాలోని లక్ష్యాలను మాత్రమే కాకుండా, అంతకంటే దూరంగా ఉన్న ప్రాంతాలను కూడా చేధించే సామర్థ్యాన్ని పాక్ సైన్యం పెంచుకుంటోంది. ఇదే ధోరణి కొనసాగితే, భవిష్యత్తులో పాకిస్తాన్ అభివృద్ధి చేసే ఖండాంతర క్షిపణులు (ICBMs) నేరుగా అమెరికాకు కూడా ముప్పుగా మారే ప్రమాదం ఉందని నివేదిక హెచ్చరించింది.
పాకిస్తాన్ - తాలిబన్ల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు
ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో పాకిస్తాన్ మరియు తాలిబన్ల మధ్య సంబంధాలు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. ఆఫ్ఘన్ మట్టిని వాడుకుని ఉగ్రవాద గ్రూపులు పాకిస్తాన్‌పై దాడులు చేస్తున్నాయని ఇస్లామాబాద్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీనికి ప్రతిచర్యగా, ఫిబ్రవరి 26న పాకిస్తాన్ సైన్యం ఆఫ్ఘనిస్తాన్‌లోని సరిహద్దు ప్రాంతాలతో పాటు రాజధాని కాబూల్‌పై కూడా బాంబు దాడులు చేసింది. పాకిస్తాన్ చరిత్రలో ఆఫ్ఘన్ నగరాలపై దాడులు చేయడం ఇదే మొదటిసారి. శాంతి నెలకొనాలంటే ఉగ్రవాదులకు సహకరించడం ఆపాలని పాక్ హెచ్చరిస్తుండగా, తాము ఎవరికీ ఆశ్రయం ఇవ్వడం లేదని తాలిబన్లు బుకాయిస్తున్నారు.
ISIS-K ప్రభావం, తాలిబన్ల చర్యలు
దక్షిణాసియాలో ISIS-K (ఇస్లామిక్ స్టేట్ - ఖొరాసాన్) ఇంకా తన ఉనికిని చాటుకుంటోందని, ఇతర దేశాలపై దాడులు చేసేందుకు ప్రణాళికలు వేస్తోందని నివేదిక తెలిపింది. అయితే, తాలిబన్లు తమ భద్రతా వ్యవస్థను మెరుగుపరుచుకుంటూ ISIS-K లక్ష్యాలపై దాడులు నిర్వహిస్తున్నారని వెల్లడించింది. తాలిబన్ల దాడుల కారణంగా కొంతమంది ISIS-K నాయకులు పొరుగు దేశాలకు పారిపోయినట్లు అమెరికా నిఘా విభాగం అంచనా వేసింది.