క‌రోనాపై బైడెన్ ఆందోళ‌న.. అక్కడ అందరూ వ్యాక్సిన్ కు అర్హులే..!

In US all adults Eligible For Covid Vaccine By April 19.కరోనా మహమ్మారి ప్రపంచంలోని ఎన్నో దేశాలను ఇబ్బందులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 April 2021 2:20 PM GMT
క‌రోనాపై బైడెన్ ఆందోళ‌న.. అక్కడ అందరూ వ్యాక్సిన్ కు అర్హులే..!

కరోనా మహమ్మారి ప్రపంచంలోని ఎన్నో దేశాలను ఇబ్బందులు పెడుతూనే ఉంది. ప్రపంచానికే పెద్దన్న అమెరికాను కూడా కరోనా మహమ్మారి తెగ టెన్షన్ పెడుతూ ఉంది. క‌రోనా వైర‌స్ ప్ర‌భావం అమెరికాలో మరోసారి తీవ్రమవ్వడంతో అమెరికా అధ్య‌క్షుడు బైడెన్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. వర్జీనియాలో ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఆయ‌న ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. త‌మ దేశం ఇప్పటికీ చావు బతుకుల రేసులోనే ఉందని.. ప్రజలు తప్పనిసరిగా క‌రోనా నిబంధ‌న‌లు పాటించాల‌ని అన్నారు.

త‌మ ప్ర‌భుత్వం 75 రోజుల్లో 150 మిలియన్ల డోసుల వ్యాక్సినేషన్ కార్య‌క్ర‌మాన్ని పూర్తి చేసిందని.. మొద‌ట‌ 100 రోజుల్లో 100 మిలియన్‌ డోసుల వ్యాక్సిన్లు ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.. కానీ కరోనా మహమ్మారి తీవ్రతను బట్టి ఇప్పుడు ఆ లక్ష్యాన్ని 200 మిలియన్లకు పెంచామని తెలిపారు.

ఈ ఏడాది జులై 4వ తేదీలోపు క‌రోనా తీవ్ర‌త త‌గ్గి మంచి రోజులు వస్తాయని.. ఆలోపు ఎంతమందిని కాపాడుకుంటామనేదే ముఖ్య‌మ‌ని అన్నారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్లు వేయించుకోవాల‌ని.. ఈ నెల‌‌ 19 నుంచి అమెరికాలో వయోజనులందరికీ వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం ప్రారంభ‌మ‌వుతుంద‌ని చెప్పారు. టీకా పంపిణీలో ముందుగా విధించుకున్న లక్ష్యాలను అధిగమించేందుకు అమెరికాలోని అందరికీ టీకాను అందించాలని జో బైడెన్ నిర్ణయించారు. ఏప్రిల్ 19 నుంచి బాల బాలికలు మినహా అందరికీ టీకాను అందించడాన్ని ప్రారంభించనున్నారు.

వాస్తవానికి మే 1 నుంచి అందరికీ టీకాను ఇస్తారని తొలుత భావించినప్పటికీ, ఇప్పుడు దాన్ని మరింత ముందుకు తీసుకొచ్చారు. అమెరికా లోని 50 రాష్ట్రాల్లో వ్యాక్సిన్ పంపిణీ శరవేగంగా జరుగుతోంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిలో పడి, వేగంగా దూసుకెళ్లాలంటే, భారీ ఎత్తున వ్యాక్సిన్ సరఫరా ఒక్కటే మార్గమని బైడెన్ భావిస్తున్నారు. దేశ వాసులందరికీ టీకాను అందిస్తే, కరోనా మహమ్మారిపై విజయం సాధించినట్టేనని అంచనా వేస్తున్నారు. ఈ దిశగా లక్ష్యాన్ని సాధ్యమైనంత తొందరలో అందుకోవాలని అనుకుంటున్నారు. యూఎస్ లో రోజుకు 10 లక్షల మందికి టీకాను ఇవ్వాలని మొదట అనుకున్నారు, ఆ లక్ష్యాన్ని ఇప్పటికే అధిగమించిన అధికారులు, ప్రస్తుతం రోజుకు 31 లక్షల మందికి టీకాను ఇస్తున్నారు. వారాంతాల్లో 40 లక్షల మంది వరకూ టీకాను తీసుకుంటున్నారు. బైడెన్ అధికారంలోకి వచ్చిన 75 రోజుల్లోనే 15 కోట్ల టీకా డోస్ లను అందించారు.


Next Story