ఒసామా బిన్ లాడెన్‌ను అలా మట్టుబెట్టేశాం : అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా
In New Book, Obama Recalls Raid That Killed Bin Laden.. అంతర్జాతీయ ఉగ్రవాది, అల్‌ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్‌పై
By సుభాష్ Published on 18 Nov 2020 2:51 PM ISTఅంతర్జాతీయ ఉగ్రవాది, అల్‌ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్‌పై అమెరికా జరిపిన దాడిలో పాక్ నుంచి ఎలాంటి సాయం తీసుకోలేదని అగ్రరాజ్యం మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. పాక్ మిలటరీలోని కొన్ని అంతర్గత శక్తులకు తాలిబన్, అల్‌ఖైదాతో సంబంధాలున్నాయన్నది బహిరంగ రహస్యమేనని, అలాంటప్పుడు పాక్ నుంచి మద్దతు ఎలా ఆశిస్తామని ఆయన తెలిపారు. ఏ ప్రామిస్ట్ ల్యాండ్ పేరుతో ఒబామా పుస్తకం రాశారు. ఇందులో బిన్ లాడెన్ కోసం అమెరికా కమాండోలు చేపట్టిన సీక్రెట్ ఆపరేషన్ గురించి వివరంగా ప్రస్తావించారు. ఆ ఆపరేషన్ గురించి పలు విషయాలను వివరించారు ఒబామా.
అబొట్టాబాద్‌లోని పాకిస్థానీ మిలటరీ కంటోన్మెంట్ ప్రాంతంలోని ఓ సురక్షిత ప్రాంతంలో అల్‌ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ దాక్కున్నట్లు మాకు స్పష్టమైన సమాచారం అందిందని, లాడెన్‌పై దాడి చేయడానికి ఈ సమాచారం చాలానిపించిన వెంటనే కార్యాచరణ ప్రారంభించామన్నారు. అయితే ఎలాంటి దాడి చేయగలమని నేను టామ్ డోనిలన్ (అప్పటి జాతీయ భద్రత సలహాదారు) ,జాన్ బ్రెన్నన్ (అప్పటి సీఐఏ అధికారి)లను అడిగాను. అయితే లాడెన్‌పై మేం ఎలాంటి నిర్ణయాన్ని తీసుకున్నా దానిని గోప్యంగా ఉంచడం మా ముందున్న సవాల్. ఎందుకంటే దీనిపై చిన్న సమాచారం బయటకు లీక్ అయినా గొప్ప అవకాశాన్ని కోల్పోతామని మాకు తెలుసు. అందుకే ప్రభుత్వంలోని అత్యంత తక్కువ మంది మాత్రమే ఆ రహస్య ఆపరేషన్ గురించి తెలిసేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాం అని ఒబామా చెప్పుకొచ్చారు.
ఇక మాకున్న మరో అడ్డంకి పాకిస్థాన్. ఉగ్రవాదంపై పోరులో ఆ దేశ ప్రభుత్వం మాకు సహకరిస్తున్నప్పటికీ పాక్ మిలటరీలో కొన్ని అంతర్గత శక్తులకు ముఖ్యంగా ఇంటెలిజెన్స్ సర్వీసెస్ కు తాలిబన్, ఆల్‌ఖైదా ఉగ్రవావాదులతో సంబంధాలున్నాయన్నది బహిరంగ రహస్యమేనని అన్నారు. ఇక లాడెన్ దాక్కున్న కాంపౌండ్ పాక్ మిలటరీ కంటోన్మెంట్‌కు కేవలం కొన్ని మైళ్ల దూరంలోనే ఉంది. ఆ ఆపరేషన్ గురించి పాకిస్థానీలకు ఏదైనా చెబితే లాడెన్‌కు సమాచారం అందే అవకాశం ఉంటుంది. అందుకే పాకిస్థానీలను ఇందులో భాగస్వామ్యం చేయవద్దని గట్టిగా నిర్ణయించుకున్నామని అన్నారు.
సమాచారమంతా సేకరించిన తర్వాత చివరగా మా ముందున్న రెండు అవకాశాల గురించి చర్చించుకున్నాం. ఒకటి లాడెన్ ఉన్న కాంపౌండ్‌ను వైమానిక దాడులతో పూర్తిగా ధ్వంసం చేయాలి. మరొకటి ప్రత్యేక కమాండో ఆపరేషన్. ఇందులో కొంత మంది కమాండోలు హెలికాప్టర్ ద్వారా పాకిస్థాన్ భూభాగంలోకి ప్రవేశించి, దాడి చేసి ఆ దేశ పోలీసులు, మిలటరీ స్పందించకముందే అక్కడి నుంచి తిరిగా రావాలి అని నిర్ణయించుకున్నాం. కమాండో ఆపరేషన్ విజయవంతం అయితే తర్వాత జాతీయ, అంతర్జాతీయ నేతల నుంచి అనేక ఫోన్ కాల్స్ వచ్చాయి. పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ నుంచి ఫోన్ వస్తే మాత్రం ఇబ్బంది తప్పదని భావించా. అనుకున్నట్లే ఆయన నుంచి కాల్ వచ్చింది. అయితే ఈ ఆపరేషన్‌పై ఆయన అభినందనలు తెలుపడమే కాకుండా పూర్తి మద్దతు ప్రకటించడం సంతోషం అనిపించింది. లాడెన్ మట్టుబెట్టడం మంచి విషయం అని జర్దారీ అన్నారు. తన భార్య బెనజీర్ భుట్టో ఉగ్రవాదుల చేతుల్లో హత్యకు గురైన విషయాన్ని గుర్తు చేసుకుని ఉద్వేగానికి గురయ్యారు అంటూ ఒబామా అప్పటి ఘటనలను పుస్తకంలో రాసుకొచ్చారు. ఇలా లాడెన్ గురించి ఎన్నో విషయాలు రాసుకొచ్చారు ఒబామా.
అమెరికా ట్విన్ టవర్స్ కూల్చి దాదాపు 3 వేల మందిని పొట్టనబెట్టుకున్న ఆల్‌ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ ను 2011, మే 2న అమెరికా దళాలు హతమార్చిన విషయం తెలిసిందే.