టీకా వేసుకుంటే కరోనా తీవ్రత ఉండదు.. తేల్చి చెప్పిన అమెరికా సీడీసీ
The covid vaccine reduces the risk of hospitalization.కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నట్టయితే, పాజిటివ్ వచ్చినా ఆసుపత్రిలో చేరాల్సినంత తీవ్రత ఉండదని స్పష్టం చేసింది.
By తోట వంశీ కుమార్ Published on 29 April 2021 3:37 PM ISTకరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి మంచి కబురు అందింది. అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజెస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ కొన్ని ఆసక్తికర వివరాలు వెల్లడించింది. కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నట్టయితే, పాజిటివ్ వచ్చినా ఆసుపత్రిలో చేరాల్సినంత తీవ్రత ఉండదని స్పష్టం చేసింది. 65 ఏళ్లకు పైబడిన వారు అయినా సరే రెండు డోసులు తీసుకున్న అనంతరం, వారికి 94 శాతం రక్షణ కలుగుతుందని వివరించింది. ఒక డోసు తీసుకుంటే 64 శాతం రక్షణ కలుగుతుందని వెల్లడించింది. టీకా తీసుకున్న వారు కరోనా వైరస్ ను సాధారణ జలుబును ఎదుర్కొన్నట్టు గానే ఎదుర్కొంటారని పేర్కొంది.
అమెరికాలో వ్యాక్సిన్‌ల ప్రభావాన్ని తెలుసుకునేందుకు అక్కడి వ్యాధి నియంత్రన నిర్మూలన కేంద్రం ఓ అధ్యయనాన్ని చేపట్టింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా 14రాష్ట్రాల్లో 24 ఆసుపత్రుల్లోని 417 మంది కొవిడ్ రోగుల సమాచారాన్ని విశ్లేషించింది. వీటిని వ్యాక్సిన్ తీసుకున్న మరో 187గ్రూపు వారితో పోల్చి చూసింది. తద్వారా పూర్తి మోతాదులో అంటే రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్న వారు కొవిడ్‌తో ఆసుపత్రిలో చేరే ప్రమాదం 94శాతం తగ్గిందని గుర్తించింది. ఇక ఒక డోసు తీసుకున్న వారిలో 64శాతం ఆసుపత్రుల్లో చేరే ప్రమాదం తగ్గినట్లు సీడీసీ పేర్కొంది. దీంతో ప్రస్తుతం అమెరికాలో పంపిణీ అవుతోన్న ఫైజర్, మోడెర్నా టీకాలు అత్యంత సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు మరోసారి నిరూపితమయ్యాయని సీడీసీ అభిప్రాయపడింది. అయితే వ్యాక్సిన్ తీసుకున్న రెండు వారాల తర్వాతే శరీరం పూర్తిస్థాయిలో రోగనిరోధకత ప్రతిస్పందనలను కలిగి ఉంటున్నట్లు సీడీసీ పేర్కొంది.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వల్ల ప్రాణాలు కోత్పోతున్న వారిలో ఎక్కవ మంది 65ఏళ్లు పైబడినవారే ఉన్నట్లు సమాచారం దీంతో వ్యాక్సిన్ పంపిణీలో వారికే తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో టీకా తీసుకున్న వృద్ధులలో మరణాల రేటు పూర్తిగా తగ్గిపోయింది. బ్రిటన్, ఇజ్రాయెల్ దేశాలు కూడా ఇలాంటి అధ్యయనాలే చేపట్టాయి. ఇజ్రాయెల్ లో వృద్ధులకు వ్యాక్సిన్లు పూర్తి రక్షణ కల్పిస్తున్నాయని తేలింది. అటు, బ్రిటన్ లో కరోనా టీకా ఒక డోసు వేసుకున్నా సరే 50 శాతం రక్షణ కలిగిస్తున్నట్టు గుర్తించారు.