ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్.. మానవాళికి ఎంత యూజ్ అవుతుందో.. అంతే ప్రమాదకారిగా కూడా మారే అవకాశం ఉందని కొందరు హెచ్చరిస్తూ ఉంటారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తూ ఉంటే అదే నిజమయ్యేలా కనిపిస్తోంది. ఎంతో మంది ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది. పలు టెక్ కంపెనీలు ఏఐ ను నమ్ముకుని ఎంతో మందిని ఉద్యోగాల నుండి తీసివేయబోతున్నాయి. భవిష్యత్తులో జరిగేది ఇదే అని కూడా అంటున్నారు.
అమెరికన్ టెక్ కంపెనీ IBM ఆ బాటలోనే నడిచే అవకాశం ఉంది. ఆ కంపెనీలో ఎంపిక చేసిన రోల్స్ కు సంబంధించి ఉద్యోగులను వాడకుండా.. కృత్రిమ మేధస్సుతో భర్తీ చేయాలని భావిస్తోంది. IBM CEO అరవింద్ కృష్ణ రాబోయే ఐదేళ్లలో AI ద్వారా కొన్ని బ్యాక్-ఆఫీస్ ఫంక్షన్‌లను భర్తీ చేయవచ్చని సూచించారని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. మానవ వనరులను AI ద్వారా భర్తీ చేయవచ్చని కృష్ణ తెలిపారు. అమెజాన్‌తో సహా అనేక కంపెనీలు సిబ్బందిని తొలగించి AI తో పనులు చెక్కబెట్టాలని యోచిస్తున్నాయనే కథనాలు వచ్చిన తర్వాత ఈ ప్రకటన బయటకు వచ్చింది. IBM ఖర్చులను పరిమితం చేసుకోడానికి ఈ సంవత్సరం ప్రారంభంలో జనవరి నెలలో దాదాపు 4,000 మంది కార్మికులను తొలగించాలని నిర్ణయం తీసుకుంది. ఐదేళ్ల వ్యవధిలో AI, ఆటోమేషన్ ద్వారా పనులను నిర్వహించాలని ఐబీఎం అధికారులు భావిస్తూ ఉన్నారు. రాబోయే సంవత్సరాల్లో దాదాపు 7,800 ఉద్యోగాలను AI ద్వారా భర్తీ చేయనున్నారు.