వేలంలో లక్షల రూపాయలు పలికిన పక్షి ఈక‌.. దీని స్పెషాలిటీ ఇదే

వేలంపాటలో అంతరించిపోయిన ఓ పక్షి ఈక రికార్డు ధరకు అమ్ముడుపోయింది. వేలు కాదు.. ఏకంగా లక్షల రూపాయల ధర పలికింది.

By అంజి  Published on  24 May 2024 9:34 AM GMT
Huia bird , new zealand, Huia bird feather

వేలంలో లక్షల రూపాయలు పలికిన పక్షి ఈక‌.. దీని స్పెషాలిటీ ఇదే

వేలంపాటలో అంతరించిపోయిన ఓ పక్షి ఈక రికార్డు ధరకు అమ్ముడుపోయింది. వేలు కాదు.. ఏకంగా లక్షల రూపాయల ధర పలికింది. అయితే ఈ వేలం పాట జరిగింది మన దగ్గర కాదు.. న్యూజిలాండ్‌ దేశంలో. హుయా పక్షికి సంబంధించిన ఓ వేలంలో దాని ఈక 46,521.50 న్యూజిలాండ్ డాలర్ల రికార్డు స్థాయి ధర పలికింది. భారతీయ కరెన్సీలో ఈ మొత్తం 23 లక్షల 66 వేల 374 రూపాయలు. మొదట ఈ పక్షి ఈక 3 వేల డాలర్ల వరకు ధర పలుకుతుందని అందరూ అనుకున్నారు. గతంలో ఇదే జాతికి చెందిన ఈక ధర పోల్చితే.. 450 శాతం ఎక్కువ పలికి, గత పక్షి ఈక రికార్డును బద్దలు కొట్టింది.

మావోరి తెగ ప్రజలు హుయా పక్షిని పవిత్రంగా భావిస్తారు. వాటి ఈకలను తెగకు చెందిన ముఖ్యమైనవారు, వారి కుటుంబసభ్యులు తలపై ధరించేవారు. వీటితో వ్యాపారం చేసేవారు. గిఫ్ట్‌లుగానూ ఇచ్చేవారు. చివరిసారిగా 1907లో హుయా పక్షి కనిపించింది. ఆ తర్వాత 20, 30 ఏళ్ళపాటు ఈ పక్షి కనిపించినట్టు కొన్ని వార్తలు వెలువడ్డాయి. అయితే ఆ వార్తలు పూర్తిగా నిర్దారణ కానీ వార్తలు అని మ్యూజియమ్ ఆఫ్ న్యూజిలాండ్ తెలిపింది. న్యూజిలాండ్‌లోని వాటెల్ బర్డ్ కుటుంబానికి చెందిన చిన్న పక్షే హుయా. తెల్లని అంచులు కలిగిన అందమైన ఈకలు ఈ పక్షికి గెంతే సామర్థ్యం కూడా ఉంది.

వేలంలో అమ్ముడుపోయిన ఈక చాలా అద్భుతంగా ఉందని వెబ్స్ ఆక్షన్ హౌస్‌లోని డెకరేటివ్ ఆర్ట్స్ హెడ్ లేహ్ మోరిస్ చెప్పారు. అది ఇప్పటికీ దాని మెరుపును కలిగి ఉందన్నారు. ఈకకు కీటకాల వల్ల ఎటువంటి నష్టం జరగలేదని చెప్పారు. ఈకను అతినీలలోహిత రక్షిత గ్లాసు వెనుక ఆర్కైవల్ పేపర్‌పై ఫ్రేమ్ చేశారు. దీనివల్ల అది దీర్ఘకాలం మన్నుతుందట. మావోరీ తెగ తయారుచేసే వస్తువులను రక్షించే టాంగో టుటురు వ్యవస్థ కింద ఈ ఈకను నమోదు చేశారు.

Next Story