చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించింది. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఈ మహమ్మారి బారిన పడగా.. లక్షల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ మహమ్మారిని అంతం చేసేందుకు ప్రస్తుతం కొన్ని వ్యాక్సిన్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే చాలా దేశాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను మొదలు పెట్టేశాయి. అయితే.. కొన్ని చోట్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయన్న ప్రచారం వల్ల చాలా మంది వ్యాక్సిన్‌ను వేయించుకోవడానికి ఇష్ట పడడం లేదు. ఈక్రమంలో వ్యాక్సిన్‌పై అవగాహన పెంచేందుకు ప్రభుత్వంతో పాటు కొన్ని సంస్థలు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.
యూఏఈ ప్రభుత్వం కూడా అక్కడి ప్రజలకు వ్యాక్సిన్ అందిస్తోంది. ఇప్పటి వరకు దాదాపు 27లక్షల మందికి వ్యాక్సిన్‌ను వేశారు. నిరంతంర వ్యాక్సిన్ అందించేందుకు యూఏఈ ప్రభుత్వం రంగం సిద్దం చేసింది. వివిధ దేశాల నుంచి వ్యాక్సిన్ ను దిగుమతి చేసుకుంటోంది. ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగంగా సాగేందుకు యూఏఈలోని ప్రైవేటు సంస్థలు ప్రభుత్వానికి సహాయం అందిస్తున్నాయి. ఇందులో భాగంగా దుబాయ్‌లోని బాబా ఆల్ షామ్స్ అనే రిసార్ట్ కొత్త ఆఫర్‌ను ప్రకటించింది.
వ్యాక్సిన్ వేయించుకున్న కస్టమర్లకు తమ హోటల్‌లోని అన్ని బుకింగ్స్‌పై 25 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్టు ప్రకటించింది. ఈ ఆఫర్ ద్వారా కొంతమంది అయినా సరే.. స్వయంగా వెళ్లి వ్యాక్సిన్ వేయించుకుంటారన్న ఆశాభావాన్ని హోటల్ యాజమాన్యం వ్యక్తం చేసింది. అన్నట్లు ఈ ఆఫర్ ఏప్రిల్ 30 వరకు మాత్రమే ఉంటుందట.