కెనడాలో మరో హిందూ దేవాలయం ధ్వంసం
కెనడా దేశంలోని అల్బెర్టా రాజధాని ఎడ్మాంటన్‌లోని హిందూ దేవాలయం మంగళవారం "ద్వేషపూరిత గ్రాఫిటీ"తో ధ్వంసమైంది.
By అంజి Published on 23 July 2024 6:12 AM GMTకెనడాలో మరో హిందూ దేవాలయం ధ్వంసం
కెనడా దేశంలోని అల్బెర్టా రాజధాని ఎడ్మాంటన్‌లోని హిందూ దేవాలయం మంగళవారం "ద్వేషపూరిత గ్రాఫిటీ"తో ధ్వంసమైంది. కెనడాలోని హిందూ సంస్థలపై ఇటీవల జరిగిన దాడుల పరంపరకు ఈ సంఘటన తోడైంది. కెనడియన్ పార్లమెంటు సభ్యుడు చంద్ర ఆర్య BAPS స్వామినారాయణ్ మందిరాన్ని అపవిత్రం చేయడంపై తన ఆందోళనను వ్యక్తం చేశారు. "గత కొన్ని సంవత్సరాలుగా, గ్రేటర్ టొరంటో ఏరియా, బ్రిటిష్ కొలంబియా, కెనడాలోని ఇతర ప్రదేశాలలో హిందూ దేవాలయాలు ద్వేషపూరిత గ్రాఫిటీతో ధ్వంసం చేయబడుతున్నాయి" అని అన్నారు.
కాగా ధ్వంసమైన ఆలయ గోడపై ఇలా ఉంది: “ప్రధానమంత్రి మోదీ ఎంపీ ఆర్య హిందూ ఉగ్రవాదులు కెనడా వ్యతిరేకులు.” ఈ ఘటన తర్వాత కెనడాలోని విశ్వహిందూ పరిషత్ దీనిని ఖండించింది. పెరుగుతున్న అతివాద భావజాలానికి వ్యతిరేకంగా కెనడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చింది. "వీహెచ్‌పీ కెనడా ఎడ్మంటన్‌లోని BAPS మందిర్‌లో హిందూఫోబిక్ గ్రాఫిటీ, విధ్వంసక చర్యలను తీవ్రంగా ఖండించింది" అని సంస్థ ఎక్స్ పోస్ట్‌లో రాసింది.
"మన దేశంలో శాంతిని ప్రేమించే హిందూ సమాజంపై ద్వేషాన్ని పెంచుతున్న తీవ్రవాద భావజాలానికి వ్యతిరేకంగా నిర్ణయాత్మకంగా వ్యవహరించాలని కెనడాలోని అన్ని స్థాయి ప్రభుత్వాలను మేము కోరుతున్నాము" అని వీహెచ్‌పీ పేర్కొంది. ఈ మధ్య కాలంలో ఖలిస్తానీ వేర్పాటువాదులు ఇలాంటి గ్రాఫిటీలతో ఆలయాన్ని ధ్వంసం చేయడం ఇదే మొదటిసారి కాదు. ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ మరణం తర్వాత ఖలిస్తాన్ మద్దతుదారులు తమ భారత వ్యతిరేక కార్యకలాపాలను పెంచారు.