ఆ రెండు టీకాలు తీసుకునేవారిలో.. గుండె క‌ణాల్లో వాపు

Heart inflammation link to Pfizer and Moderna jabs.క‌రోనా మ‌హ‌మ్మారిని అడ్డుకునేందుకు వ్యాక్సినేష‌న్ ఒక్క‌టే మార్గం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 July 2021 8:04 AM GMT
ఆ రెండు టీకాలు తీసుకునేవారిలో.. గుండె క‌ణాల్లో వాపు

క‌రోనా మ‌హ‌మ్మారిని అడ్డుకునేందుకు వ్యాక్సినేష‌న్ ఒక్క‌టే మార్గం అని నిపుణులు చెబుతున్న సంగ‌తి తెలిసిందే. దీంతో చాలా దేశాలు వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మాల‌ను వేగ‌వంతం చేశాయి. మ‌న‌దేశంలో కొవాగ్జిన్‌, కోవిషీల్డ్ అందుబాటులో ఉండ‌గా.. మ‌రికొన్ని విదేశీ వ్యాక్సిన్లకు ప్ర‌భుత్వం అనుమ‌తులు ఇచ్చింది. ఇక విదేశాల్లో ఎక్కువ‌గా ఫైజ‌ర్‌, మోడెర్నా టీకాలు అందుబాటులో ఉన్నాయి. తాజాగా ఓ వార్త వ్యాక్సిన్ తీసుకున్న వారిని ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. ఫైజర్‌, మోడెర్నా టీకాలు తీసుకునేవారు అప్రమత్తంగా ఉండాలని యురోపియన్‌ మెడిసిన్స్‌ ఏజెన్సీ హెచ్చరించింది.

ఈ రెండు టీకాలు తీసుకున్న వారిలో చాలా స్వల్ప స్థాయిలో గుండె కణజాలంలో వాపు వస్తున్నట్లు డాక్టర్లు గుర్తించినట్లు యూరోపియన్‌ వైద్య నియంత్రణాధికారులు వెల్ల‌డించారు. పురుషుల్లో చాలా సాధార‌ణంగా ఆసైడ్ ఎఫెక్ట్ క‌నిపిస్తున్న‌ట్లు చెప్పారు. అయినప్పటికీ కోవిడ్‌ వ్యాక్సిన్‌ వల్ల ఎక్కువ స్థాయిలో లాభం జరుగుతుందన్నారు. ఆ రెండు టీకాలు తీసుకునేవారిలో గుండె కణాల్లో వాపు వస్తున్న కారణంగా రోగులు, డాక్టర్లు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

లక్షణాలు..

ఫైజర్‌, మోడెర్నా టీకాలు తీసుకున్నవారిలో కొంతమందికి ఛాతి నొప్పి, శ్వాస ఆడకపోవడం, గుండె మంట లాంటి లక్షణాలు నమోదయినట్లు యురోపియన్‌ ఏజెన్సీ తెలిపింది. ఇలాంటి లక్షణాలు ఉన్నవారు కచ్చితంగా డాక్టర్లను సంప్రదించాలని సూచించింది. ఫైజర్‌ టీకా తీసుకున్న 17.7 కోట్ల మందిలో.. 145 మందికి మయోకార్డిటిస్‌, 138 మందిలో పెరికార్డిటిస్‌ లాంటి లక్షణాలు కనిపించినట్లు అధికారులు చెప్పారు.

ఆస్ట్రాజెనికా, జాన్సన్‌ టీకాలతో ఆ సమస్య లేదు..

మోడెర్నా టీకా తీసుకున్న 2 కోట్ల మందిలో 19 మయోకార్డిటిస్‌, 19 పెరీకార్డిటిస్‌ కేసులు నమోదు అయ్యాయని యురోపియన్‌ ఏజెన్సీ వెల్లడించింది. కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న 14 రోజుల్లో మయోకార్డిటిస్‌ లక్షణాలు కనిపించే అవకాశముందన్నారు. ఎంఆర్‌ఎన్‌ఎ టెక్నాలజీతో తయారైన ఈ వ్యాక్సిన్‌లను వేసుకున్నవారిలో గుండె కణాల్లో వాపును గుర్తించినట్లు డాక్టర్లు తెలిపారు. ఆస్ట్రాజెనికా, జాన్సన్‌ టీకాలతో ఆ సమస్య లేదని తెలిపారు.

Next Story