హమాస్.. టాప్ లీడర్ హతం
బుధవారం తెల్లవారుజామున టెహ్రాన్‌లో హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియే హతమయ్యాడని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఒక ప్రకటనలో తెలిపింది.
By అంజి
హమాస్.. టాప్ లీడర్ హతం
బుధవారం తెల్లవారుజామున టెహ్రాన్‌లో హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియే హతమయ్యాడని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ఒక ప్రకటనలో తెలిపిందని రాయిటర్స్ నివేదించింది. అతడి నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని చేసిన దాడిలో ఇస్మాయిల్ హనియే హతమయ్యాడని నివేదికలు వచ్చాయి.
గాజాలో ఇజ్రాయెల్‌తో పాలస్తీనాకు చెందిన హమాస్ ఉగ్రవాద సంస్థ ఓ వైపు యుద్ధంలో నిమగ్నమై ఉంది. ఇస్మాయిల్ హనియే ఈ యుద్ధంలో కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. టెహ్రాన్‌లోని అతని నివాసంలో ఉండగా ఇజ్రాయెల్ చేసిన దాడిలో ఇస్మాయిల్ హనియే, అతని అంగరక్షకులలో ఒకరు మరణించారు. హనియే హతమయ్యాడని హమాస్ కూడా ఒక ప్రకటనలో ధృవీకరించింది. ఖతార్‌లో ప్రవాసం తీసుకుంటూ.. హమాస్ రాజకీయ కార్యకలాపాలకు నాయకత్వం వహించిన హనియే, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని కూడా కలిశారు. ఇజ్రాయెల్-గాజా యుద్ధం మధ్య, కాల్పుల విరమణ చర్చలలో హనియే సంధానకర్తగా వ్యవహరించాడు. ఇజ్రాయెల్ వైమానిక దాడులనో హనీయే ముగ్గురు కుమారులు, అతని నలుగురు మనవళ్లు చనిపోయారని హమాస్ ఏప్రిల్‌లో పేర్కొంది.
ఎవరీ ఇస్మాయిల్ హనియే:
62 ఏళ్ల ఇస్మాయిల్ హనియే గాజా సిటీకి సమీపంలోని శరణార్థి శిబిరంలో జన్మించాడు. 1980ల చివరలో హమాస్‌లో చేరాడు. హమాస్ వ్యవస్థాపకుడు షేక్ అహ్మద్ యాసిన్‌కు సన్నిహితుడిగా చాలా తక్కువ సమయంలోనే ఎదిగాడు. 1980లు, 1990లలో, హనియే ఇజ్రాయెల్ జైళ్లలో అనేక శిక్షలు అనుభవించాడు. 2006 శాసనసభ ఎన్నికలలో హమాస్ విజయం సాధించిన తరువాత, అతను పాలస్తీనా అథారిటీ ప్రభుత్వానికి ప్రధాన మంత్రి అయ్యాడు. మరుసటి సంవత్సరం 2007లో అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ అతనిని పదవి నుండి తొలగించాడు. పదేళ్ల తర్వాత 2017లో హమాస్ రాజకీయ విభాగానికి అధిపతిగా ఎన్నికయ్యాడు. అదే సంవత్సరం, ఇస్మాయిల్ హనియేను యునైటెడ్ స్టేట్స్ " గ్లోబల్ టెర్రరిస్ట్"గా పేర్కొంది.