అర్థరాత్రి ఇంట్లో చొర‌బ‌డి.. దేశాధ్య‌క్షుడి దారుణ హ‌త్య‌

Haiti President Jovenel Moïse assassinated at home.కరేబియన్ దీవుల స‌ముదాయంలోని హైతి దేశ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 July 2021 8:49 AM IST
అర్థరాత్రి ఇంట్లో చొర‌బ‌డి.. దేశాధ్య‌క్షుడి దారుణ హ‌త్య‌

కరేబియన్ దీవుల స‌ముదాయంలోని హైతి దేశ అధ్య‌క్షుడు జొవెనెల్‌ మోయిజ్ దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు. స్థానిక కాల‌మానం మంగ‌ళ‌వారం అర్థ‌రాత్రి ఒంటి గంట( తెల్ల‌వారితే బుధ‌వారం) స‌మ‌యంలో కొంద‌రు గుర్తు తెలియ‌ని దుండ‌గులు ఆయ‌న నివాసంలోకి చొరబడి అధ్యక్షుడితో పాటు ఆయన సతీమణిపై తుపాకులతో దాడికి పాల్పడినట్లు ఆ దేశ తాత్కాలిక ప్రధాని క్లౌడే జోసెఫ్‌ వెల్లడించారు. ఈ ఘ‌ట‌న‌లో జొవెనెల్ మోయిజ్ అక్క‌డిక్క‌డే ప్రాణాలు కోల్పోగా.. ఆయ‌న స‌తీమ‌ణి మార్టినే మోయిస్ తీవ్రంగా గాయ‌ప‌డ‌డంతో.. ఆమెకు ప్ర‌స్తుతం ఆస్ప‌త్రిలో చికిత్స అందిస్తున్నారు.

సాయుధ క‌మాండో గ్రూపు స‌భ్యులే ఇందుకు కార‌ణమ‌ని తాత్కాలిక ప్రధాని క్లౌడే జోసెఫ్ ఆరోపించారు. అనాగరిక, అమానవీయ, విద్వేషపూరిత చర్యగా దీనిని అభివర్ణించారు. దాడికి దిగిన వారిలో కొందరు స్పానిష్‌ , ఇంగ్లీషు భాషలో మాట్లాడారని తెలిపారు. అయితే ఎవరు ఈ ఘాతుకానికి ఒడిగట్టారో ఇంకా తెలియలేదన్నారు. ప్రస్తుతం దేశంలో భద్రతా పరిస్థితులు అదుపులోనే ఉన్నాయన్నారు. ప్ర‌స్తుతం దేశ బాధ్య‌త‌ల‌ను తానే నిర్వ‌హించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

53 ఏళ్ల వయసున్న మోయిజ్‌ 2017లో అధికారంలోకి వచ్చారు. అప్పట్నుంచి ఆయన తన అధికారాన్ని పెంచుకునే ప్రయత్నాలే చేశారు. కోర్టులు, ప్రభుత్వ కాంట్రాక్టర్లు, ఆడిటర్లు, ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీలు కేవలం అధ్యక్షుడికే జవాబుదారీలా ఉండేలా నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలో ఎన్నికలు నిర్వహించడంలో ఆయన విఫలమయ్యారు. రాజ‌ధాని పోర్ట్ ఆఫ్ ప్రిన్స్ స‌హా ప‌లుచోట్ల సాయుధ ముఠాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు కూడా ఎక్కువ‌య్యారు. దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుదల, ఆహార కొరత తీవ్రంగా ఉంది. దీంతో అధ్యక్షుడిపై తీవ్ర వ్యతిరేకత నెలకొంది.

దీన్ని గ‌మ‌నించి నాలుగేళ్ల‌లో ఏడుసార్లు ప్ర‌ధానుల‌ను మార్చారు. మూడు నెల‌ల క్రితం నియ‌మించిన ప్ర‌స్తుత ప్ర‌ధాని క్లాడ్ జోసెఫ్ ను తొల‌గించి ఈ వారంలోనే ఏరియ‌ల్ హెన్నీ(71) నియ‌మించ‌డానికి రంగం సిద్దం చేశారు. నిజానికి హైతీ అధ్యక్షుని పదవీ కాలం గత ఫిబ్రవరితోనే ముగిసిందని ప్రతిపక్షాలు అంటున్నాయి. రెండేళ్లుగా ఆయన ఈ పదవిలో కొనసాగుతున్నా ఏ నాడూ దేశ సమస్యలను పట్టించుకోలేదని వారు ఆరోపిస్తున్నారు. ఆయన రాజీనామా చేయాల్సిందేనని వీరు డిమాండ్ చేస్తున్న వేళ ఈ హత్య జరిగింది. బహుశా కుట్ర జరిపి ఈ హత్యకు పాల్పడి ఉండవచ్చునని భావిస్తున్నారు.

Next Story