పాఠశాలపై దాడి.. 140 మంది విద్యార్థుల కిడ్నాప్
Gunmen kidnap 140 high school students in Nigeria.ఇటీవల నైజీరియాలో పాఠశాలలపై వరుస దాడులు జరుగుతున్నాయి.
By తోట వంశీ కుమార్ Published on 6 July 2021 5:30 AM GMTఇటీవల నైజీరియాలో పాఠశాలలపై వరుస దాడులు జరుగుతున్నాయి. తాజాగా కదునా రాష్ట్రంలోని బెథేల్ బాప్టిస్ట్ హైస్కూల్‌పై సోమవారం తెల్లవారుజామున దుండగులు దాడి చేశారు. కాల్పులతో భయానక వాతావరణం సృష్టించారు. దాదాపు 140 విద్యార్థులను అపహరించుకుపోయారు. దుండగులు దాడి చేసిన సమయంలో పాఠశాలలో 165 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దాడి నుంచి 26 మంది చిన్నారులు, పాఠశాల సిబ్బంది తృటిలో తప్పించుకున్నారని స్థానికులు చెబుతున్నారు. కిడ్నాప్ చేసిన చిన్నారులను రహస్య ప్రాంతానికి తరలించినట్లు అక్కడి మీడియా తెలిపింది.
కాగా.. ఈ ఘటనపై బెథెల్ బాప్టిస్ట్ హైస్కూల్ టీచర్ ఇమ్మాన్యుల్ మాట్లాడుతూ.. కిడ్నాపర్లు 140 మంది విద్యార్థులను తీసుకెళ్లారు. 26 మంది విద్యార్థులు మాత్రం తప్పించుకోగలిగారు. విద్యార్థులను దుండగులు ఎక్కడికి తీసుకెళ్లారో ఇంకా సమాచారం లేదన్నారు. విద్యార్థులను కిడ్నాప్ చేశారనే సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఎలా జరిగింది అనే దానిపై ఆరా తీశారు. విద్యార్థుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
కాగా.. కదునా రాష్ట్రంలో గడిచిన ఆరు నెలల్లో విద్యార్థులను కిడ్నాప్ చేయడం ఇది నాలుగో సారి. గతేడాది డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ఇక్కడ వెయ్యి మంది పిల్లలను సాయుధులు అపహరించుకుపోయారు. వీరిలో 200 మంది ఇప్పటికీ కనిపించడం లేదు.