పాఠ‌శాల‌పై దాడి.. 200 మంది విద్యార్థుల కిడ్నాప్‌

Gunmen abduct students from school in north-central Nigeria.ఇటీవ‌ల నైజీరియాలో పాఠ‌శాల‌ల‌పై వ‌రుస దాడులు జ‌రుగుతున్నాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  31 May 2021 10:33 AM IST
పాఠ‌శాల‌పై దాడి.. 200 మంది విద్యార్థుల కిడ్నాప్‌

ఇటీవ‌ల నైజీరియాలో పాఠ‌శాల‌ల‌పై వ‌రుస దాడులు జ‌రుగుతున్నాయి. తాజాగా నైజ‌ర్ రాష్ట్రంలోని ఓ ఇస్లామిక్ పాఠ‌శాల‌పై ఆదివారం దాడి చేసిన దుండ‌గులు విద్యార్థుల‌ను కిడ్నాప్ చేశారు. సుమారు 200 మంది విద్యార్థుల‌ను ఎత్తుకెళ్లిన‌ట్లు అక్క‌డి మీడియా సంస్థ‌లు వెల్ల‌డించాయి. మారణాయుధాలతో వచ్చిన దుండ‌గులు పాఠశాలపై దాడి చేశారని పోలీస్ అధికారి వసియూ అబియోదిన్​ తెలిపారు. ఈ దాడిలో ఇద్దరు గాయపడ్డారని, ఒకరు చనిపోయారని తెలిపారు. విద్యార్థులకోసం గాలింపు చర్యలు ప్రారంభించిన‌ట్లు వెల్ల‌డించారు.

నైజీరియా ఉత్తర రాష్ట్రాల్లో డబ్బు కోసం స్కూలు పిల్లలను కిడ్నాప్ చేస్తున్న కేసులు ఇటీవల పెరుగుతున్నాయి. ఫిబ్రవరిలో జాంఫారా రాష్ట్రంలోని జాంగెబేకు చెందిన ఒక బోర్డింగ్ స్కూలు నుంచి 300 మంది బాలికలను సాయుధ దుండగులు కిడ్నాప్ చేశారు. తర్వాత వారిలో చాలామందిని విడిచిపెట్టారు. తాజా దాడిలో.. తుపాకులతో బైకుల మీద వచ్చిన కొందరు దుండగులు నగరంలోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షులు చెప్పినట్లు ఓ ప్ర‌ముఖ ఛాన‌ల్ తెలిపింది. కాల్పులకు భయపడి చుట్టుపక్కల జనం పారిపోవడంతో.. వాళ్లు ఇస్లామిక్ పాఠశాలలోకి ప్రవేశించి విద్యార్థులను ఎత్తుకుపోయారు. ఈ పాఠశాలకు 6-18 ఏళ్ల మ‌ధ్య ఉన్న బాలబాలికలు హాజరవుతారు.

Next Story