అమెరికాలో కాల్పుల కలకలం, ముగ్గురు మృతి
అగ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పుల మోతతో ఉలిక్కిపడింది.
By Srikanth Gundamalla Published on 7 Dec 2023 3:41 AM GMTఅమెరికాలో కాల్పుల కలకలం, ముగ్గురు మృతి
అగ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పుల మోతతో ఉలిక్కిపడింది. లాస్ వేగాస్‌లోని నెవాడా యూనివర్సిటీ ప్రధాన క్యాంపస్‌లో బుధవారం ఓ వ్యక్తి తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ సంఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని అధికారులు వెల్లడించారు. మరో వ్యక్తికి తీవ్రంగా గాయాలు అయ్యాయని చెప్పారు. అతన్ని ఆస్పత్రికి తరలించామనీ.. పరిస్థితి విషమంగానే ఉన్నట్లు చెప్పారు. కాగా.. కాల్పులకు తెగబడ్డ నిందితుడిని కూడా పోలీసులు కాల్చి చంపారనీ తెలిపారు. పోలీసులు నిందితుడిపై కాల్పులు జరిపామని అంటున్నారు. అయితే.. పోలీసుల కాల్పుల్లో నిందితుడు మరణించాడా? లేదంటే కాల్పుల తర్వాత తానే ఆత్మహత్య చేసుకున్నాడా అనేది తేలాల్సి ఉంది.
నిందితుడి కాల్పుల్లో మరణించిన ముగ్గురి వివరాలను అధికారులు ఇంకా గుర్తించలేదు. ఈ సంఘటన జరిగిన తర్వాత వెంటనే యూనివర్సిటీని పోలీసులు ఖాళీ చేయించారు. నిందితుడు ఎవరు.? ఎందుకు కాల్పులు జరిపాడు? అసలు కారణాలేంటి.? అని అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు మాట్లాడిన అమెరికా పోలీసులు.. యూనివర్సిటీలో ముగ్గురి డెడ్‌బాడీలను గుర్తించామని చెప్పారు. దుండగుడి కాల్పుల్లో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడని అన్నారు. గాయపడ్డ వ్యక్తిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నట్లు వెల్లడించారు. అయితే.. అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారనీ అన్నారు. చనిపోయిన వారిలో కాల్పులు జరిపినట్లుగా అనుమానిస్తున్న వ్యక్తి కూడా ఉన్నాడని పోలీసులు తెలిపారు.
కాల్పుల సంఘటన తర్వాత నెవాడా విశ్వవిద్యాలయం, అన్ని ఇతర దక్షిణ నెవాడా విద్యాసంస్థలను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. దాంతో.. వాటన్నింటినీ క్లోజ్ చేశారు. విశ్వవిద్యాలయం దగ్గర పలు రహదారులను కూడా పోలీసులు మూసివేశారు. నెవాడా విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో దాదాపు 25,000 మంది అండర్ గ్రాడ్యుయేట్లు, 8,000 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఉన్నారు.