అమెరికాలో కాల్పుల కలకలం.. ఐదుగురు దుర్మరణం
అమెరికాలో వరుసగా కాల్పుల సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
By Srikanth Gundamalla Published on 26 Jun 2024 3:45 AM GMTఅమెరికాలో కాల్పుల కలకలం.. ఐదుగురు దుర్మరణం
అమెరికాలో వరుసగా కాల్పుల సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల ఓ మార్కెట్‌లో కాల్పులు జరపగా.. భారత్‌కు చెందిన ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన మరువక ముందే మరోటి వెలుగు చూసింది. సోమవారం రాత్రి జరిపిన వరుస కాల్పుల్లో ఐదుగురు చనిపోయారు. లాస్ వెగాస్‌కు సమీపంలో ఈ కాల్పుల సంఘటన జరిగినట్లు తెలింది.
నార్త్ లాస్ వెగాస్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో సోమవారం సాయంత్రం ఈ కాల్పులు జరిగాయని పోలీసు అధికారులు చెబుతున్నారు. ముందుగా ఒక అపార్ట్‌మెంట్‌లో కాల్పులు జరిపి.. ఆ తర్వాత మరో దాంట్లోకి నిందితుడు ప్రవేశించాడని చెప్పారు. 57 ఏళ్ల ఎరిక్ ఆడమ్స్ అనే వ్యక్తి కాల్పులకు తెగబడినట్లు చెప్పారు. ఈ కాల్పులు జరిగిన సంఘటనా స్థలిలో ముందుగా ఇద్దరు మహిళల మృతదేహాలను గుర్తించారు. ఆ తర్వాత ఇంకాస్త లోపలికి వెళ్లగా తూటాలు తగిలి తీవ్రంగా గాయపడ్డ ఒక 13 ఏళ్ల బాలికను గుర్దించారు. దాంతో.. ఆ చిన్నారిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. మరో అపార్ట్‌మెంట్‌లో ఇద్దరు మహిళలతో పాటు పురుషుడి మృతదేహాలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మొత్తంగా ఈ కాల్పుల సంఘటనలో నలుగురు మహిళలు, ఒక పురుషుడు చనిపోయినట్లు తెలిపారు.
ఇక కాల్పుల తర్వాత నిందితుడు ఆడమ్స్ కోసం రాత్రిపూట వేట కొనసాగించారు. కచ్చితమైన సమచారం ఉండటంతో లొంగిపోవాలని సూచనలు చేశారు. పోలీసులు నిందితుడిని సమీపిస్తున్న సమయంలో.. అతను తనని తానే కాల్చుకుని చనిపోయాడని ఉన్నతాధికారులు వెల్లడించారు. అయితే.. నిందితుడు ఎందుకు కాల్పులు జరిపాడు అనే విషయాలను పోలీసులు వెల్లడించలేదు. దీనిపై విచారణ జరుపుతున్నట్లు చెప్పారు. ఆడమ్స్ బంధువులను సంప్రదించే ప్రయత్నాల్లో ఉన్నట్లు చెప్పారు. కానీ.. వాళ్లెవరూ అందుబాటులో లేరని సమాచారం.