యజమానికి హార్ట్ ఎటాక్.. ఆ కుక్క ఏం చేసిందంటే..?
German Shepherd saves Owner life.జంతులన్నింటిలో కల్లా విశ్వాసం గల జంతువు కుక్క అని అంటుంటారు.
By తోట వంశీ కుమార్
జంతులన్నింటిలో కల్లా విశ్వాసం గల జంతువు కుక్క అని అంటుంటారు. చాలా సందర్భాల్లో అది నిజమేనని నిరూపితం అయింది. ఆపదలో ఉంటే తమ ప్రాణాలు ఫణంగా పెట్టి.. యజమానుల ప్రాణాలు కాపాడిన ఘటనలు ఎన్నో చూశాం. సాటి మనుషులకు లేని విశ్వాసం, ప్రేమ కుక్కలకు ఉంటాయి. ఓ వ్యక్తి.. కుక్కను దత్తత తీసుకుని ప్రేమతో పెంచుకున్నాడు. అయితే.. అతడికి ఓ రోజు హార్ట్ ఎటాక్ వచ్చింది. సమయానికి ఆ పెంపుడు శునకం యజమాని పరిస్థితిని అర్థం చేసుకుని సమయస్పూర్తితో వ్యవహరించడంతో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు.
వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన బ్రియాన్ మైయర్స్ అనే వ్యక్తి 'రమపో బెర్గెన్ యానిమల్ రెప్యూజీ' అనే జంతు సంరక్షణా కేంద్రం నుంచి జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన ఓ కుక్కను దత్తత తీసుకున్నాడు. దానికి 'శాడీ' అని పేరు పెట్టుకున్నాడు. చెప్పిన పనిని అది వెంటనే చేసేది. దాని తెలివితేటలు, చురుకుదనం బ్రియాన్‌కు తెగ నచ్చేశాయి. దీంతో దాన్ని కన్నబిడ్డలాగా చూసుకునేవాడు. వారం రోజుల క్రితం ఇంట్లో ఎవరూ లేని సమయంలో బ్రియాన్‌కు హార్ట్ ఎటాక్ వచ్చింది. కిందపడి నొప్పితో గిలగిల్లాడసాగాడు.
యజమాని పరిస్థితిని గమనించిన శాడీ ఆయన దగ్గరకు వెళ్లింది. అతడు స్ప్రహ కోల్పోకుండా కళ్లను నాకటం ప్రారంభించింది. అనంతరం బ్రియాన్ చొక్కాను నోటితో కరుచుకుని సెల్‌ఫోన్ దగ్గరకు లాక్కెళ్లింది. వెంటనే ఆయన అంబులెన్స్‌కు ఫోన్ చేశాడు. అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకుని అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. దీంతో బ్రియాన్ ప్రాణాలతో బయటపడ్డాడు. తనకు పునర్జన్మనిచ్చిన తన శాడీని కౌగిలించుకుని 'మై సన్' అంటూ ప్రేమగా నిమిరాడు. ఇది మాటలకందని అనుభూతని బ్రియాన్ వెల్లడించాడు. ఈ ఘటనను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. శాడీపై ప్రసంశల వర్షం కురుస్తోంది.