సైన్యంలో రోబో.. ఫ్రాన్స్ ఆర్మీ ప్రయోగాలు

French army is testing Boston Dynamics' robot dog Spot in combat scenarios. అచ్చం కుక్క లాగానే కనిపిస్తుంది. కానీ, ఓ రోబో. కదన రంగంలో సైన్యంతో కలిసి ముందుకు దూసుకుపోయే యుద్ధ వీరుడిది.

By Medi Samrat  Published on  9 April 2021 3:47 AM GMT
french army

స్పాట్.. ఎవరికైనా స్పాట్ పెట్టగలదు. చూడ్డానికి అచ్చం కుక్క లాగానే కనిపిస్తుంది. కానీ, ఓ రోబో. కదన రంగంలో సైన్యంతో కలిసి ముందుకు దూసుకుపోయే యుద్ధ వీరుడిది. సైన్యానికి అండగా ఉంటూ శత్రువుల పని పడుతుంది. దానిని ఫ్రెంచ్ సైన్యం మంగళవారం పరీక్షించింది. దాంతో పాటు మరికొన్ని రోబోలను కదన రంగంలోకి ప్రవేశపెడితే ఎలా పనిచేస్తాయో తెలుసుకుంది.

అమెరికాకు చెందిన బోస్టన్ డైనమిక్స్ అనే సంస్థ తయారు చేసిన ఆ రోబోలపై ఫ్రాన్స్ సైన్యం విస్తృతంగా పరీక్షలు జరుపుతోంది. మిలటరీ స్కూల్ ద ఎకోల్ స్పెషల్ మిలటరీ డీ సెయింట్ సిర్ (కంబైన్డ్ ఆర్మ్స్ స్కూల్) ఆధ్వర్యంలో వాటిని పరీక్షిస్తోంది. అందులో భాగంగానే మంగళవారం మిలటరీ స్కూల్ విద్యార్థులు రెండ్రోజుల పాటు వాటి పనితీరును పరిశీలించారు. విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్నప్పుడు చేయాల్సిన ఆపరేషన్లు, రాత్రి వేళల్లో రక్షణ, పట్టణ ప్రాంతాల్లో యుద్ధ సన్నద్ధత వంటి వాటిపై రోబోలకు శిక్షణనిచ్చినట్టు చెబుతున్నారు. అయితే, స్పాట్ లో ప్రధాన సమస్య బ్యాటరీ.. చాలా త్వరగా అందులో చార్జింగ్ అయిపోతోందని అంటున్నారు.

స్పాట్ తో పాటు ఎస్టోనేషియా సంస్థ మిల్రెమ్ తయారు చేసిన రిమోట్ తో నడిచే మినీ యుద్ధ ట్యాంకు ఆప్టియో ఎక్స్20, ఫ్రాన్స్ మిలటరీ నెక్ట్సర్ తయారు చేసిన రోబో మ్యూల్ అల్ట్రో, పలు రకాలుగా వాడుకునే వీల్డ్ డ్రోన్ బరాకుడాలను టెస్ట్ చేసింది. అయితే, భవిష్యత్ లో వాటిని ఎలా వాడుకుంటారన్నది సందేహమే.

ఇప్పటికే అమెరికా వైమానిక దళంలో వీటిని వినియోగిస్తున్నారు. యుఎస్ సైనిక ఆస్తులకు రక్షణగా నిలిచి, శత్రు దాడుల సమాచారాన్ని చేరవేసేందుకు వీటిని యుద్ధ క్షేత్రంలో ఉపయోగిస్తున్నారు.


Next Story