ఉత్తర అరిజోనాలోని నవజో నేషన్‌లో మంగళవారం వైద్య రవాణా విమానం కూలిపోయి మంటలు చెలరేగడంతో నలుగురు మరణించారని అక్కడి అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. న్యూ మెక్సికోలోని అల్బుకెర్కీ నుండి బయలుదేరిన సీఎస్‌ఐ ఏవియేషన్ కంపెనీకి చెందిన విమానం.. ఫ్లాగ్‌స్టాఫ్‌కు ఈశాన్యంగా 200 మైళ్లు (321 కిలోమీటర్లు) దూరంలో ఉన్న చిన్లేలోని విమానాశ్రయానికి సమీపంలో ప్రమాదానికి గురైంది. విమానంలో ఉన్నవారు వైద్య సిబ్బంది, వారు రోగిని తీసుకెళ్లడానికి ఆసుపత్రికి వెళ్తున్నారు.
బీచ్‌క్రాఫ్ట్ 300 విమానం మధ్యాహ్నం వేళ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా కూలిపోయిందని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు ఒక ఇమెయిల్‌లో తెలిపారు. జాతీయ రవాణా భద్రతా బోర్డు, FAA దర్యాప్తు చేస్తున్నాయి. ప్రమాదానికి కారణం తెలియదని అధికారులు తెలిపారు. నవాజో నేషన్ అధ్యక్షుడు బుయు నైగ్రెన్ ఒక సోషల్ మీడియా పోస్ట్‌లో మాట్లాడుతూ.. ఈ ప్రమాదం గురించి తెలిసి తాను బాధపడ్డానని అన్నారు. "వీరు ఇతరులను రక్షించడానికి తమ జీవితాలను అంకితం చేసిన వ్యక్తులు. వారి నష్టం నవజో నేషన్ అంతటా తీవ్రంగా కలత చెందేలా చేసింది" అని ఆయన అన్నారు.