నేపాల్ రాజకీయాల్లో ప్రకంపనలు.. మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ అరెస్ట్
నేపాల్ మాజీ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీని శనివారం తెల్లవారుజామున పోలీసులు అరెస్ట్ చేశారు. 2025 సెప్టెంబర్‌లో జరిగిన 'జెన్ జీ' ...
By - అంజి |
నేపాల్ రాజకీయాల్లో ప్రకంపనలు.. మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ అరెస్ట్
ఖట్మండు: నేపాల్ మాజీ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీని శనివారం తెల్లవారుజామున పోలీసులు అరెస్ట్ చేశారు. 2025 సెప్టెంబర్‌లో జరిగిన 'జెన్ జీ' (Gen Z) నిరసనల అణిచివేతలో చోటుచేసుకున్న మరణాలకు (నేరపూరిత నరహత్య) సంబంధించి ఆయనపై ఈ చర్యలు తీసుకున్నారు. ఓలీతో పాటు మాజీ హోం మంత్రి రమేష్ లేఖక్‌ను కూడా భక్తపూర్‌లోని వారి నివాసాల్లో అదుపులోకి తీసుకున్నారు. నేపాల్ కొత్త ప్రధానిగా రాపర్ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన బాలేన్ షా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే ఈ కీలక పరిణామం చోటుచేసుకోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.
ఏమిటీ 'జెన్ జీ' విప్లవం?
గతేడాది సెప్టెంబర్‌లో అవినీతి, నిరుద్యోగం మరియు రాజకీయ అస్థిరతకు వ్యతిరేకంగా నేపాల్ యువత పెద్ద ఎత్తున 'జెన్ జీ విప్లవం' పేరిట వీధుల్లోకి వచ్చింది. డిజిటల్ స్వేచ్ఛ కోసం మొదలైన ఈ ఉద్యమం కాస్తా ప్రభుత్వ వ్యతిరేక తిరుగుబాటుగా మారింది. అప్పట్లో ఓలీ ప్రభుత్వం ఈ నిరసనలను ఉక్కుపాదంతో అణిచివేసే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో జరిగిన హింసలో సుమారు 76 మంది ప్రాణాలు కోల్పోగా, 2,000 మందికి పైగా గాయపడ్డారు. ముఖ్యంగా నిరసనల మొదటి రోజే 19 మంది యువకులు పోలీసు కాల్పుల్లో మరణించడానికి ఓలీ వైఫల్యమే కారణమని దర్యాప్తు కమిషన్ తేల్చింది.
10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం:
ఈ హింసాత్మక ఘటనలపై విచారణ జరిపిన ఉన్నత స్థాయి కమిషన్, ఓలీతో పాటు మాజీ హోం మంత్రి, అప్పటి పోలీస్ చీఫ్ చంద్ర కుబేర్ ఖాపుంగ్‌లపై ప్రాసిక్యూషన్‌కు సిఫార్సు చేసింది. "ప్రభుత్వ కార్యనిర్వాహక అధిపతిగా, జరిగిన మంచి చెడ్డలకు ఓలీయే బాధ్యత వహించాలి" అని కమిషన్ నివేదిక స్పష్టం చేసింది. ఒకవేళ కోర్టులో నేరం నిరూపితమైతే వీరికి గరిష్ఠంగా 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అయితే, ఈ నివేదికను ఓలీ తిరస్కరించారు. ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు అని, తన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓలీ తన సొంత నియోజకవర్గంలో కూడా బాలేన్ షా చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూడటం గమనార్హం.