యూరోప్‌ను ముంచెత్తిన వరదలు.. 168కి చేరిన మృతులు
Flood death toll rises to 183 in Europe.పశ్చిమ ఐరోపాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ధాటికి వరదలు
By తోట వంశీ కుమార్ Published on 18 July 2021 12:46 PM ISTపశ్చిమ ఐరోపాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ధాటికి వరదలు పోటెత్తుతున్నాయి. జర్మనీ, బెల్జియంను వరదలు పూర్తిగా ముంచెత్తాయి. ఈ రెండు దేశాల్లో వరదల కారణంగా ఇప్పటి వరకు సుమారు 168 మంది మృతి చెందగా.. వందలాది మంది గల్లంతు అయ్యారని అధికారులు చెబుతున్నారు. గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. జర్మనీలోని అహర్వీలర్ కౌంటీ, నార్త్ రైన్-వెస్ట్ ఫాలియా రాష్ట్రాల్లోనే 141 మందికిపైగా మృతి చెందగా.. బెల్జియంలో 27 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి అధికారులు తెలిపారు. వందలాది మంది గల్లంతు కాగా.. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
నీటి ప్రవాహానికి అనేక ఇళ్లు నేలమట్టం అయ్యాయి. కార్లు, ట్రక్కులు వంటి వాహనాలు కొట్టుకుపోయాయి. వీధులన్నీ బురదలో మునిగిపోయాయి. అనేక కాలనీలతో సంబంధాలు తెగిపోయాయి. సెల్లార్లలో శవాలు మరిన్ని బయటపడే ఛాన్సు ఉందన్నారు. మట్టి, బురదతో నిండిపోయిన గ్రామాలను క్లీన్ చేసేందుకు సైనిక దళాలు, ఫైర్‌ఫైటర్లు రంగంలోకి దిగాయి. జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్ వాల్టర్ స్టెయిన్‌మీర్ కొలోన్‌కు నైరుతి దిశలో ఉన్న ఈర్ఫ్స్టాడ్కు వెళ్లి అక్కడి పరిస్థితులను పరిశీలిస్తారని సంబంధిత అధికారులు వెల్లడించారు. ఇక బెల్జియంలోనూ పరిస్థితి దారుణంగా ఉంది. ఇక్కడ 27 మంది వరకు వరదల ధాటికి ప్రాణాలు కోల్పోయారు. వరద నీటిలో కొట్టుకుపోయిన కార్లు, ట్రక్కులతో పాటు ఇతర వాహనాల్లో మరికొన్ని మృతదేహాలు ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.
వరదల కారణంగా చాలా ప్రాంతాలు ఇప్పటికీ విద్యుత్ లేక అంధకారంలోనే ఉన్నాయి. రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. వదరల్లో చిక్కుకున్న వారిని సహాయక బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. వ్యర్థాలు, అడ్డంకులు తొలగించేందుకే వారాలు పడుతుందని, ఆ తరువాతే ఎంతమేర నష్టం వాటింల్లింది అనేది అంచనా వేయగలమని అంటున్నారు. ఇదిలా ఉంటే.. తీవ్రంగా దెబ్బతిన్న అహర్విలర్ ప్రాంతాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున సందర్శకులు వస్తుండడం పోలీసులకు తలనొప్పిగా మారింది.