ఘోర ప్రమాదం.. రన్‌వేపై ఢీకొన్న రెండు విమానాలు

జపాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆ దేశ రాజధాని టోక్యోలో విమానం ప్రమాదానికి గురైంది.

By Srikanth Gundamalla  Published on  2 Jan 2024 4:40 PM IST
flight, crash, fire,  japan, tokyo,

ఘోర ప్రమాదం.. రన్‌వేపై ఢీకొన్న రెండు విమానాలు 

జపాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆ దేశ రాజధాని టోక్యోలో విమానం ప్రమాదానికి గురైంది. రన్‌వేపై ల్యాండ్‌ అవుతుండగా మంటలు చెలరేగాయి. హొక్కైడో విమానాశ్రయం నుంచి వచ్చిన ఈ విమానం ఒక్కసారిగా ప్రమాదానికి గురి కావడంతో ఎయిర్‌పోర్టులో కలకలం రేగింది.

టోక్యోలోని హనెడా ఎయిర్‌పోర్టులో రన్‌వేపైకి విమానం ల్యాండింగ్‌కువచ్చింది. హొక్కైడో నుంచి జపాన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన జేఏఎల్ 516 విమానం హనెడా ఎయిర్‌పోర్టుకు వచ్చింది. అయితే.. ఎయిర్‌పోర్టు అధికారులు కూడా విమానం ల్యాండింగ్‌కు రన్‌వేను క్లియర్‌ చేశారు. ఆ మేరకు విమాన సిబ్బందికి గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారు. ఏమైందో తెలియదు కానీ.. ల్యాండింగ్ సమయంలో విమానం కింద ఒక్కసారిగా మంటలు వచ్చాయి. విమానం వేగంగా ఉన్న కారణంగా మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు కొన్ని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కాగా.. ప్రమాద సమయంలో విమానంలో ప్రయాణికులు, సిబ్బందితో మొత్తం అందరినీ కలుపుకొని 400 మంది ఉన్నారనీ జపాన్‌ టైమ్స్‌ వెల్లడించింది. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన ఎయిర్‌పోర్టు అధికారులు వెంటనే అందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్లు తెలిపింది. కానీ.. ప్రమాదంలో ఎంతమందికి గాయాలు అయ్యాయి.. పరిస్థితి ఎలా ఉందనేది మాత్రం తెలియలేదు. చివరకు అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా ఆర్పేసినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు అధికారులు చెప్పారు. విమానం ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతున్న సమయంలో కోస్ట్‌గార్డ్ విమానాన్ని ఢీకొని ఉంటుందనీ.. అందువల్లే ఈ సంఘటన జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపాక వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.


Next Story